Share News

Kavitha Political Mediation: కాంగ్రెస్‌తో రాయబారం

ABN , Publish Date - May 28 , 2025 | 04:25 AM

కవిత బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతూ కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చేరికకు ‘నో’ అని చెప్పినా, కవిత స్వతంత్రంగా సొంత అడుగులు వేస్తోంది.

Kavitha Political Mediation: కాంగ్రెస్‌తో రాయబారం

  • హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు

  • మధ్యవర్తి ద్వారా అధిష్ఠానంతో సంప్రదింపులు

  • సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ దృష్టికి తెచ్చిన అధిష్ఠానం

  • ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్‌ నేతల నిర్ణయం

  • కేసీఆర్‌ కుటుంబ కలహాలకు కాంగ్రెస్‌ కారణమన్న

  • తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అభిప్రాయం

  • కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు

  • కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన

  • వారిలో అత్యధికులు గ్రేటర్‌లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే!

  • లేఖలు, లీకుల కలకలంతోపాటు భవిష్యత్తూ కారణమే

  • అదే సమయంలో, సొంత అడుగుల దిశగా కవిత

  • క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు

  • గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి

  • సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు

  • కార్మికులతో భేటీ.. కో ఆర్డినేటర్ల నియామకం

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్‌ అధిష్ఠానంతో రాయబారం నడిపారా!? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా!? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం అందుకు ‘నో’ చెప్పిందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు! లేఖలు, లీకుల ద్వారా బీఆర్‌ఎస్‌లో కలకలం నెలకొన్న సమయంలోనే.. ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల రెండు మూడు రోజులపాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే, కవిత ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు వివరించాయి. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్‌ కుటుంబ కలహాలకు కాంగ్రెస్‌ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి.


ఇదే అదనుగా..!

బీఆర్‌ఎస్‌లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ‘చేయి’ అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేఖ.. ఆ తర్వాత లీకులు బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారమూ విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్‌ కేసీఆర్‌, హరీశ్‌ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరూ హాజరు కానున్నారు కూడా. ఇక, ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోనూ విచారణ ముమ్మరమవుతోంది. ఈ కేసు కూడా బీఆర్‌ఎస్‌ పెద్దల మెడకు చుట్టుకోనుంది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా.. ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వ రగడ నెలకొందని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతంగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారని, అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ తలుపు తడుతున్నారని తెలుస్తోంది. నిజానికి, బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధికులు గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతం నుంచే ఉన్నారు. ఈ ఏడాది చివరికే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, కారు దిగి చేయి అందుకోవడానికి కూడా ఇదే సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వాస్తవానికి, గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దాంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ కేసీఆర్‌, హరీశ్‌ రావు తదితరులు పదే పదే ప్రకటనలు చేశారు. దీంతో, అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారు. పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పంచన చేరారు. అప్పట్లోనే, గ్రేటర్‌ సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేల చేరికకూ రంగం సిద్ధమైంది. కానీ, ఫిరాయిస్తే సభ్యత్వం రద్దంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆ ప్రక్రియను నిలిపేసింది. అయితే, తాజాగా, కేసీఆర్‌ కుటుంబంలో రేగిన చిచ్చుతో గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు ఆకర్షితులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


సొంత అడుగుల దిశగా..

రాయబారాలు విఫలం కావడంతో ఎమ్మెల్సీ కవిత తదుపరి కార్యాచరణపై దృష్టిసారించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. తొలుత, గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం సింగరేణి ప్రాంత జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. ‘సింగరేణి జాగృతి’ పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో బీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీఎ్‌సకే) ఉంది. ఆ సంఘానికి కొంతకాలంపాటు కవిత గౌరవాధ్యక్షురాలిగా పని చేశారు. దానికి పోటీగా ఇప్పుడు మరో సంఘాన్ని ఏర్పాటు చేసినా.. టీజీబీకేఎ్‌సతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కొత్త సంఘం నాయకులకు కవిత దిశా నిర్దేశం చేయడం విశేషం. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తున్నానని కవిత ఆ సమావేశంలో తెలిపారు. టీబీజీకేఎ్‌సతో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని, వాటిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారని, వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సీబీఎ్‌సఈ సిలబ్‌సలో విద్యా బోధన చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. ఇక నుంచి కవిత అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశమయ్యే అవకాశం ఉందని జాగృతి వర్గాలు వెల్లడించాయి. మేఽధావులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌తో సమావేశమవ్వడం, అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా ఆమె అడుగులు ఉంటాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కవిత తాను సొంతంగా ఎదగాలనుకుంటోన్న నేపథ్యంలో ఆమె సొంతంగా త్వరలోనే పార్టీ పెడతారన్న ప్రచారం కూడా అప్పుడే మొదలైంది. బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు కవిత పెట్టబోయే పార్టీ తేదీని కూడా ప్రకటించేశారు. జూన్‌ 2న ఆమె పార్టీ పెట్టే అవకాశాలున్నాయని, ఇప్పటికే కవిత నిర్ణయం తీసేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె సన్నిహితులు, జాగృతి వర్గాలు మాత్రం కవిత పార్టీ పెట్టబోరని వెల్లడించాయి.


కొత్తగా నియమితులైన జాగృతి కో ఆర్డినేటర్లు వీరే...

బెల్లంపల్లి - కిరణ్‌ ఓరం, శ్రీరాంపూర్‌ - కుర్మ వికాస్‌, మందమర్రి - ఎస్‌. భువన్‌, రామగుండం1 - బొగ్గుల సాయికృష్ణ, రామగుండం 2 - కె. రత్నాకర్‌ రెడ్డి, రామగుండం 3 - దాసరి మల్లేశ్‌, భూపాలపల్లి - నరేశ్‌ నేత, మణుగూరు - అజ్మీరా అశోక్‌ కుమార్‌, కొత్తగూడెం - వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్‌, కార్పొరేట్‌ - వసికర్ల కిరణ్‌ కుమార్‌, ఎస్‌ టీపీపీ పవర్‌ ప్లాంట్‌ - కె. రామ్మోహన్‌ చారి.

Updated Date - May 28 , 2025 | 06:02 AM