Share News

Kavitha: ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:55 AM

కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ‘నేను చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు.

Kavitha: ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

  • కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలి

  • 42% రిజర్వేషన్లకై ఢిల్లీలో దీక్ష చేస్తాం

  • ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలో కవిత

  • హైకోర్టు అనుమతి లేకపోవడంతో విరమణ

హైదరాబాద్‌/కవాడిగూడ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ‘నేను చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. బీసీల ఆత్మగౌరవ పోరాటం. గాంధీజీ సూచించిన అహింసా మార్గంలోనే బీసీల 42 శాతం రిజర్వేషన్లను సాధిస్తాం’ అని ఆమె చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగుతామని హెచ్చరించారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ జాగృతి, యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌ సంయుక్త ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడూతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేస్తోందన్నారు. తమ పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేక బిల్లు పెట్టడంపై కాంగ్రెస్‌ సర్కారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై రాష్ట్రంలోని బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.


బీసీలకు అన్ని హక్కులు వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్‌ చేశారు. ఓ వైపు రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెబుతోందని.. మరోవైపు కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు టైంపాస్‌ ధర్నాలు చేస్తే బీసీ బిడ్డలు ఊరుకోరన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే వాటిని ఎలా ఆపాలో తమకు తెలుసని చెప్పారు. కాళేశ్వరం నివేదికపైనా కవిత స్పందించారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికలో కేసీఆర్‌ పేరును 35 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఏమీ కాదని, ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాల్లో భాగంగానే ఆ నివేదికను బయట పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ అరెస్టుపై మీడియా లీకులను తాము పట్టించుకోబోమన్నారు. అనంతరం కవిత నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నేత అర్జున్‌సింగ్‌ చౌతాలా మాట్లాడారు.


కవిత పోరాటంలో తాము భాగస్వాములం అవుతామని, ఢిల్లీలోనూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, ఎమ్మెల్సీ కవిత సోమవారం చేపట్టిన నిరాహారదీక్షకు 72 గంటలపాటు అనుమతి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ధర్నా చౌక్‌లో కవిత చేపట్టిన దీక్షకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సమయాన్ని 72 గంటల వరకు పొడిగించాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరఫున పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. గడువును పొడిగించేందుకు నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు సూచిస్తూ.. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ధర్నా వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయరాదన్న పోలీసుల షరతును మాత్రం హైకోర్టు కొట్టేసింది. 72 గంటల దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించడంతో కవిత తన దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కోర్టులపట్ల తనకు గౌరవం ఉందని, అందుకే దీక్షను విరమించినట్లు ఆమె చెప్పారు. అంతకుముందు పెద్దఎత్తున పోలీసుల బలగాలను మోహరించడంతో ధర్నా చౌక్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 04:55 AM