Share News

Katta Ramachandra Reddy funeral: మావోయిస్టు నేత కట్టా రామ‌చంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:58 PM

సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామ‌చంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. త‌ల్లిదండ్రులు, గ్రామ‌స్థులు, కమ్యూనిస్ట్ నాయకులు కన్నీటిపర్యంతమై తుది వీడ్కోలు పలికారు.

Katta Ramachandra Reddy funeral: మావోయిస్టు నేత కట్టా రామ‌చంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి
Katta Ramachandra Reddy funeral

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామ‌చంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. త‌ల్లిదండ్రులు, గ్రామ‌స్థులు, కమ్యూనిస్ట్ నాయకులు కన్నీటిపర్యంతమై తుది వీడ్కోలు పలికారు. ఆయన అంత్య క్రియలకు భారీగా ప్ర‌జా సంఘాలు, క‌వులు త‌ర‌లివ‌చ్చారు. గ‌త‌నెల 22న ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మడ్ ఎన్‌కౌంట‌ర్‌లో రామ‌చంద్రారెడ్డి మరణించారు. ఈ క్రమంలోనే శనివారం స్వ‌గ్రామం తీగ‌ల‌కుంట గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆదివారం బంధువులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.


సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రామ‌చంద్రారెడ్డి పని చేశారు. అనంతరం వరుకోల్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, పోరాటాలపై ఆకర్షితుడై 1989లో నాటి పీపుల్స్‌వార్ తో ఏర్పడిన పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లపోయారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన నక్సల్స్‌ ఉద్యమంలో ఈయన పాల్గొన్నారు. సాధారణ సభ్యుడిగా పీపుల్స్‌ వారిలో చేరి.. కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇటీవల అబుజ్ మాడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రామ‌చంద్రారెడ్డి కన్నుమూశారు. దాదాపు నెల రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌ జరుగగా.. కట్టా మరణంపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు ఛత్తీస్‌గడ్ హైకోర్టును ఆశ్రయించి రీపోస్ట్ మార్టం చేయాలని పిటిషన్ వేశారు.


హైకోర్టు తీర్పు ఆలస్యం కావడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అక్కడే రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయాలనుకుంది. అయితే హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు మృతదేహాన్ని భద్రపరచాలని సుప్రీంకోర్టును రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తీర్పు వచ్చే వరకు డెడ్ బాడీని కాపాడాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీ పోస్ట్ మార్టం అప్పీల్‌ను హైకోర్టు నిరాకరించడంతో నెల రోజుల తర్వాత స్వగ్రామానికి రామచంద్రారెడ్డి మృతదేహం తీసుకు వచ్చారు. ఆదివారం అశ్రునయనాల నడుమ ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.


ఇవి కూడా చదవండి:

KTR: రాష్ట్ర ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్: కేటీఆర్

Jubilee Hills by-election: విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు.. సునీత నామినేషన్ ఆమోదం పొందితే ఉపసంహరణ

Updated Date - Oct 19 , 2025 | 12:58 PM