Share News

Ghanta Chakrapani: ‘కథా నిలయం’తో తెలుగు సాహిత్యానికి మేలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:47 AM

‘‘కథలు చరిత్ర నిర్మితాలు. ఆధునిక చరిత్రకు అద్దం వంటివి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాహిత్య సంస్థలు ఉన్నా.. ‘కథానిలయం’ మాదిరిగా కథలను నిక్షిప్తపరిచే క్రతువు ఎక్కడా లేదు.

Ghanta Chakrapani: ‘కథా నిలయం’తో తెలుగు సాహిత్యానికి మేలు

  • అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి

  • ఖమ్మంలో ఘనంగా ‘కథానిలయం’ వార్షికోత్సవం

ఖమ్మం సాంస్కృతికం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ‘‘కథలు చరిత్ర నిర్మితాలు. ఆధునిక చరిత్రకు అద్దం వంటివి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాహిత్య సంస్థలు ఉన్నా.. ‘కథానిలయం’ మాదిరిగా కథలను నిక్షిప్తపరిచే క్రతువు ఎక్కడా లేదు. కాళీపట్నం రామారావు తెలుగు కథకు ఇచ్చిన బహుమానమే కథానిలయం’’ అని అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి కొనియాడారు. సాధారణ గ్రంఽథాలయాల మాదిరిగా కాకుండా డిజిటల్‌ రూపంలో కథలను భద్రపరుస్తుండడం తెలుగు కథా సాహిత్యానికి, భవిష్యత్‌ తరాలకు ఎంతో మేలు చేకూర్చే అంశమని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్న కఽథానిలయం.. ప్రపంచస్థాయి సాహిత్య కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. ఖమ్మంలోని వేదిక ఫంక్షన్‌హాల్‌లో ఈస్థటిక్స్‌ స్పేస్‌ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ‘కథానిలయం’ వార్షికోత్సవం నిర్వహించారు. దాసరి అమరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చక్రపాణి మాట్లాడుతూ వేల మంది రచయతలకు చెందిన లక్షకుపైగా కథలు కథా నిలయంలో కొలువు తీరడం అభినందనీయమన్నారు.


తెలంగాణ, రాయలసీమ, ఆంరఽధా ప్రాంతాలకు చెందిన కథలు, కథకుల గురించి విస్తృతగా తెలుసుకునేందుకు కథానిలయం దోహదపడుతుందన్నారు. కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం మాట్లాడుతూ తెలుగు కథా ప్రత్యేకత భిన్నత్వం అని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన రచయితలు.. ఎవరికి వారు ప్రత్యేకతను పాటిస్తూ సామాజిక ప్రయోజనం దిశగా కథలను మలిచారన్నారు. మహిళా కథా రచయితలు సైతం పురుషులుకు దీటుగా కథాప్రకియలో రాణిస్తుండడం గొప్ప విషయమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడు ప్రసేన్‌ అధ్యక్షతన తెలంగాణ సాహిత్యంపై విస్తృత చర్చ నిర్వహించారు. తెలంగాణ కథ- సమాజ కేంద్రకం- వ్యక్తి కేంద్రకం- పరిణామం అనే అంశాలపై సంగిశెట్టి శ్రీనివాస్‌, కేపీ.అశోక్‌కుమార్‌, తిరునగరి దేవకీదేవి మాట్లాడారు. నాటినుంచి నేటి వరకు తెలంగాణ కథ తీరుతెన్ను, అంతిమ ధ్యేయం, అనుసరించాల్సిన చర్యలు వంటి వాటిపై ప్రసేన్‌ ప్రశ్నలు సంధించి వాటికి వక్తలనుంచి జవాబులు రాబట్టారు. ఖమ్మం సాహిత్య వికాసం అనే అంశంపై కవి రవి మారుత్‌ మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా నిమ్మగడ్డ శేషగిరిరావు, దాసరి అమరేంద్ర రచించిన ‘మనమెరుగని లాటిన్‌ అమెరికా’ పుస్తకాన్ని, వంశీకృష్ణ రచించిన ‘గోధుమ రంగు ఊహ’ కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Updated Date - Feb 03 , 2025 | 04:47 AM