బీసీలకే జడ్పీ పీఠం
ABN , Publish Date - Sep 28 , 2025 | 01:21 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీలకు దక్కనున్నది. ఈ స్థానాన్ని బీసీ జనరల్ స్థానంగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బీసీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులు ఎవరైనా ఈ స్థానానికి పోటీపడే అవకాశముంటుంది. గతంలో ఈ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీలకు దక్కనున్నది. ఈ స్థానాన్ని బీసీ జనరల్ స్థానంగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బీసీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులు ఎవరైనా ఈ స్థానానికి పోటీపడే అవకాశముంటుంది. గతంలో ఈ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది. అలాగే జిల్లాలోని 15 జడ్పీటీసీ, 15 ఎంపీపీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈమేరకు జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల జాబితాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం విడుదల చేశారు. 15 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో మూడు జనరల్, మూడు జనరల్ మహిళా, మూడు బీసీ జనరల్, మూడు బీసీ మహిళా, రెండు ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళా స్థానాలుగా ప్రకటించారు. కొత్తపల్లి, వీణవంక, హుజురాబాద్ మండల ప్రజాపరిషత్ స్థానాలు జనరల్ కేటగిరిలో ఉన్నాయి. గంగాధర, మానకొండూర్, గన్నేరువరం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయ్యాయి. చిగురుమామిడి, ఇల్లందకుంట, జమ్మికుంట స్థానాలు బీసీ జనరల్ కాగా, చొప్పదండి, శంకరపట్నం, రామడుగు బీసీ మహిళలకు రిజర్వు చేశారు. కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్ ఎంపీపీ స్థానాలు ఎస్సీ జనరల్ కాగా, వి.సైదాపూర్ ఎస్సీ మహిళకు కేటాయించారు.
15 జడ్పీటీసీ స్థానాల్లో కొత్తపల్లి, గంగాధర, గన్నేరువరం జనరల్ కాగా, మానకొండూర్, చిగురుమామిడి, హుజురాబాద్ స్థానాలు జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. చొప్పదండి, ఇల్లందకుంట, వీణవంక స్థానాలు బీసీ జనరల్, శంకరపట్నం, తిమ్మాపూర్, జమ్మికుంట స్థానాలు బీసీ మహిళకు రిజర్వు అయ్యాయి. ఎస్సీ జనరల్‌గా కరీంనగర్ రూరల్, రామడుగు స్థానాలు ఉండగా, వి.సైదాపూర్ ఎస్సీ మహిళకు కేటాయించారు. నిన్నమొన్నటి వరకు జడ్పీటీసీ, ఎంపీపీగా పోటీ చేస్తున్న ట్లు వివిధ పార్టీల నేతలు ఆశలు పెట్టుకోగా రిజర్వేషన్లు కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా వచ్చాయి. దీనితో అనుకూలంగా ఉన్న అభ్యర్థులు సంతోషంతో పోటీకి సన్నద్ధమవుతుండగా రిజర్వేషన్లు ప్రతికూలంగా ఉన్నవారు ఎంపీపీకి బదులుగా జడ్పీటీసీ చేయాలని, జడ్పీటీసీలకు బదులుగా ఈసారి ఎంపీపీ చేస్తే అవకాశముంటుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అప్పుడే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరోవైపు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా రిజర్వేషన్ స్థానాల వివరాలను తెలుసుకొని ఆయా స్థానాల్లో ఎవరిని పోటీలో దింపుతే బాగుంటుందని, ఆయా స్థానాలో ఎవరెవరు పోటీలో ఏయే పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాలను తెలుసుకుంటున్నారు. కొన్ని స్థానాల్లో రిజర్వేషన్ కేటగిరికి సంబంధించిన ఆశావహులు లేకపోవడంతో కొత్త అభ్యర్థులు కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఏర్పడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రఽభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ మరోసారి రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని కోరారు. రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించడంతో ఈ రిజర్వేషన్లతోనే ఎన్నిక లు నిర్వహిస్తారా లేక ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో మరోసారి రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారో చూడాల్సి ఉంది. మరోసారి రిజర్వేషన్ల ప్రక్రియ చేపడితే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే తప్ప సందేహాలు సమాధానం లభించదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.