ఏటీసీ కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:58 PM
ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం ప్రభుత్వ ఐటీఐ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2324 కోట్లకుపైగా ఖర్చు చేసి ప్రజా ప్రభుత్వం 65 ఐటీఐ సెంటర్‌లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. ఏటీసీలో నైపుణ్య శిక్షణ పొందిన పిల్లలకు కనీసం రూ.20 వేల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం ప్రభుత్వ ఐటీఐ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2324 కోట్లకుపైగా ఖర్చు చేసి ప్రజా ప్రభుత్వం 65 ఐటీఐ సెంటర్‌లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. ఏటీసీలో నైపుణ్య శిక్షణ పొందిన పిల్లలకు కనీసం రూ.20 వేల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సులు ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఏటీసీలో 250పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. పెద్దపల్లిలో ఐటీఐ ఏర్పడి 65 ఏళ్ల దాటిందని, ఇక్కడ కోర్సులు చేసిన అభ్యర్థులు సింగరేణిలో అనేక అవకాశాలు పొందారన్నారు. ప్రస్తుత ఏటీసీ సెంటర్ ద్వారా అందించే నైపుణ్య శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తల్లితండ్రులు ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులనే కాకుండా ఉపాధి అవకాశాలు సత్వరం లభించే ఏటీసీ కోర్సుల వైపు కూడా పిల్లలను ప్రోత్సాహించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తల్లితండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా పిల్లలు బాగా చదువుకొని జిల్లాకు పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.