జిల్లాలో బీజేపీ గాడిన పడేనా!
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:55 PM
భారతీయ జనతా పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, నేతల ఒంటెత్తు పోకడలతో క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కొంత కాలంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం జిల్లాపై దృష్టి సారించక పోవడంతో ఇక్కడి పార్టీ నేతలది ఆడిందే ఆట, పాడిందే పాటలా మారిందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఏర్పడింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
భారతీయ జనతా పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, నేతల ఒంటెత్తు పోకడలతో క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కొంత కాలంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం జిల్లాపై దృష్టి సారించక పోవడంతో ఇక్కడి పార్టీ నేతలది ఆడిందే ఆట, పాడిందే పాటలా మారిందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఏర్పడింది. నెల రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ రాంచందర్ రావుపై ఇక్కడి నాయకులు, కార్యకర్తలు పార్టీని గాడిన పెడతారనే ఆశలు పెంచుకున్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి ఆయన హాజరవుతున్నారు. ఆయన రాక కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుల్తానాబాద్‌లో ఆయనకు స్వాగతం పలికి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎన్‌ఆర్‌ఐ నల్ల మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా తన అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. జిల్లాలోని పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ నిలువగా బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. అనంతరం 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ రెండో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డప్పటికీ, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికీ పార్టీ పుంజుకున్నది. కానీ ఆ గాలిని కాపాడుకోలేక పోతున్నది. పెద్దపల్లి నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గాలు ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పార్టీ పదవుల విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. పదవులు ప్రకటించినప్పుడు ఆయా వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఆయా వర్గాలకు దూరంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ బలోపేతం కంటే వర్గ పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మంథని నియోజకవర్గంలో కూడా ఇటీవల విభేదాలు రచ్చకెక్కాయి. అక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతానికి పాటు పడడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదని, ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డితో భేటీ అయి సునీల్ రెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జీ పదవి నుంచి తప్పించాలని విన్నవించడం గమనార్హం. రామగుండం నియోజకవర్గంలో కూడా ఇన్‌చార్జీ కందుల సంధ్యారాణికి పాత బీజేపీ నేతలతో పొసగడం లేదు. అక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు అందరి నేతల సమన్వయంతో సాగడం లేదు. త్వరలో జరగనున్న సంస్థాగత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని రాష్ట్ర బీజేపీ నాయకత్వం గొప్పలకు పోతున్నప్పటికీ, జిల్లాలో మాత్రం పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోతున్నది. జిల్లా అధ్యక్షులు ఎవరు వచ్చినా కూడా పరిస్థితిలో మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లడంలో బీజేపీ జిల్లా నాయకత్వం విఫలం అవుతుందనే అభిప్రాయాలు సొంత పార్టీ కార్యకర్తల్లోనే నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపై దృష్టిని సారించి నేతల మధ్య వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీని గాడిన పెట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీని సన్నద్ధం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.