Share News

డీసీసీ పీఠం దక్కేదెవరికి?

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:52 AM

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వస్తున్నది. రెండు, మూడు రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులకు, నగర అధ్యక్ష పదవులకు పరిశీలకులు అందించిన పేర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమీక్షించి షార్ట్‌లిస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.

డీసీసీ పీఠం దక్కేదెవరికి?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వస్తున్నది. రెండు, మూడు రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులకు, నగర అధ్యక్ష పదవులకు పరిశీలకులు అందించిన పేర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమీక్షించి షార్ట్‌లిస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆయన శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదిత జాబితాను అందించి ఆయా అభ్యర్థుల గురించి చర్చించినట్లు తెలిసింది.కరీంనగర్‌ డీసీసీ అధ్యక్ష పదవికి మూడు పేర్లు, నగర అధ్యక్ష పదవికి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించిన జాబితాలో ప్రతిపాదించారని తెలిసింది.

కీలకంగా సామాజిక సమీకరణాలు

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పేర్లను ప్రతిపాదించారని సమాచారం. నగర అధ్యక్ష పదవికి పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ మాచర్ల ప్రసాద్‌ పేర్లను ప్రతిపాదించారని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు నియమించే అధ్యక్షులు వారివారి సామాజిక వర్గాలు, ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్‌ పదవులు పొందినవారి సామాజికవర్గాలు, మంత్రుల సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరునే ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఉమ్మడి జిల్లా పరిధి నుంచి ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విప్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో ఆయా సామాజిక వర్గాల్లో ప్రాధాన్యంలేని ఇతరవర్గాలకు అవకాశం కల్పిస్తారని, ఆ సమీకరణాల్లోనే మేడిపల్లి సత్యంకే డీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అధ్యక్ష పదవిలో ఉంటే ప్రొటోకాల్‌తోపాటు ఇతర సౌలభ్యాలు కూడా ఉంటాయని, పార్టీపై అధిక వ్యయభారం పడకుండా ఉంటుందని అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సత్యం మాత్రం డీసీసీ పదవి కంటే ప్రభుత్వ విప్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులు, వెలిచాల రాజేందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అండదండలు ఉన్నా అన్నిరకాల సమీకరణాల నేపథ్యంలో సత్యంనే ఆ పదవి వరిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

బీసీలకు నగర అధ్యక్ష పదవి

కాంగ్రెస్‌ నగర అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలని టీపీసీసీ నాయకత్వం భావించి ఇద్దరు బీసీల పేర్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో అంజన్‌కుమార్‌ సుధీర్ఘ కాలంగా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతూ వస్తుండడం, ప్రస్తుతం టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. మాచర్ల ప్రసాద్‌ మాజీ కార్పొరేటర్‌ కావడమే కాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా, ఆయన సన్నిహితుడిగా ఉన్నారు. అంజన్‌కుమార్‌ కూడా పొన్నం ప్రభాకర్‌ ఆశీస్సులతోనే బరిలో ఉన్న నేపథ్యంలో సీనియర్‌గా, విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పదవులు చేపడుతూ వచ్చి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నందున ఆయనకు నగర అధ్యక్ష పదవిని ఇవ్వడం ఖాయంగా చెబుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:52 AM