Share News

శభాష్‌ పోలీస్‌...

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:53 PM

రహదారులపై గుంతలను పూడ్చుతూ మంథని పోలీసులు ప్రజలచే శభాష్‌ అనిపించుకుంటున్నారు... ఇటీవల వరుసగా జరగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసులు దృష్టి సారించారు. పలుచోట్ల బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. రోడ్డుపై గుంతలతో వాహనాలు అదుపు తప్పి కిందపడి మరణాలు, గాయాలపాలవుతున్నారు.

శభాష్‌ పోలీస్‌...

మంథని, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రహదారులపై గుంతలను పూడ్చుతూ మంథని పోలీసులు ప్రజలచే శభాష్‌ అనిపించుకుంటున్నారు... ఇటీవల వరుసగా జరగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసులు దృష్టి సారించారు. పలుచోట్ల బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. రోడ్డుపై గుంతలతో వాహనాలు అదుపు తప్పి కిందపడి మరణాలు, గాయాలపాలవుతున్నారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసులు నిమగ్నమవుతూనే.. మరో వైపు సామాజిక బాధ్యతగా సేవలందిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ళ క్రితం నిర్మించిన మంథని-గోదావరిఖని 26 కిలోమీటర్ల ప్రధాన రహదారి పై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తారు. పలు ప్రాంతాల్లో రోడ్డు మధ్య భాగాల్లో, ఇరువైపులా పక్కన గుంతలు పడ్డాయి. రోడ్డు పై లోతుగా, వెడల్పుగా పడిన గుంతల కారణంగా వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా వచ్చి వీటిలో పడి ద్విచక్ర వాహనదారులు కింద పడి గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ ఎన్నికల డ్యూటీలో భాగంగా మంథని ప్రాంతానికి వస్తున్న క్రమంలో గుంతలు గమనించి వీటి పూడ్చివేసేలా చర్యలు తీసుకోవాలని మంథని ఎస్‌ఐ డేగ రమేష్‌ను ఆదేశించారు. దీంతో సిబ్బందితో ఆటో ట్రాలీలో మట్టి, కంకర నింపుకొని వెళ్ళి మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై పలు చోట్ల ఉన్న గుంతలను పూడ్చి వేయించారు. ప్రమాదాల నివారణ కోసం సామాజిక బాధ్యతగా గుంతలు పూడ్చిన మంథని పోలీసులను ఏసీపీ రమేష్‌ అభినందించారు.

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి - ధర్మారం వెళ్లే రహదారిలో అడుగుకో గుంత ఉండటంతో పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై గుంతలు లేకుండా పూడ్చివేశారు. గత నెల 16న కాసులపల్లి శివారులో ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన కత్తెర్ల లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రాత్రి వేళల్లో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి వాహనం అదుపు తప్పడంతో సాయిపావని (13) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమదాలను నివారించేందుకు గాను పెద్దపల్లి పోలీస్‌ అధికారులు ముందుకొచ్చారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఽపెద్దపల్లి - ధర్మారం వెళ్లే ప్రధాన రహదారిలో ఎస్‌ఐ సిబ్బందితో గుంతలను గుర్తించి పూడ్చి వేయించారు.

Updated Date - Dec 07 , 2025 | 11:53 PM