రామగుండంలో విద్యుత్ కేంద్రం నిర్మిస్తాం
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:56 PM
రామగుండంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా ప్రజల అభిష్టం మేరకు విద్యుత్ కేంద్రం కట్టి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రామగుండం పట్టణానికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
గోదావరిఖని, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): రామగుండంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా ప్రజల అభిష్టం మేరకు విద్యుత్ కేంద్రం కట్టి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రామగుండం పట్టణానికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. బీ పవర్‌హౌస్ గడ్డ నుంచి రామగుండం పట్టణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బొగ్గు, నీరు, భూమి ఉన్న రామగుండంలో విద్యుత్ కేంద్రం కట్టకుండా అవేవీ అందుబాటులో లేని యాదాద్రిలో కమీషన్ల కోసం విద్యుత్ కేంద్రం కట్టిందన్నారు. మెగావాట్‌కు రూ.8కోట్ల అంచనాలతో ప్రారంభించి రూ.13కోట్ల అంచనాలకు చేరిందన్నారు. ఆ ఖర్చుతో రామగుండంలో 800మెగావాట్ల 7యూనిట్లు నిర్మించే అవకాశం ఉండేదన్నారు. యాదాద్రిలో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ కేంద్రాలకు రూ.22వేల కోట్ల పెట్టుబడి అంచనా అయితే రూ.50వేల కోట్ల అవినీతి అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోలార్, హైడల్, సంప్‌డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లతోపాటు థర్మల్ విద్యుత్ అనివార్యమైందన్నారు. మన కన్నా వంద రెట్లు అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో సైతం థర్మల్ పవర్‌ప్లాంట్లు లేకపోవడం వల్ల గ్రిడ్ కుప్ప కూలిందన్నారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ తప్పనిసరి అని కేంద్రమే చెబుతుందన్నారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం రావడాన్ని ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలే సమాధానాలు చెబుతారన్నారు. రామగుండంలో పుట్టి పెరిగిన తాను ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం పాటుపడుతానని పేర్కొన్నారు. ఇప్పటికే రామగుండం పట్టణంలో రోడ్ల విస్తరణతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మనాలీ ఠాకూర్, దీటి బాలరాజు, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఈదునూరి హరి ప్రసాద్, అంజుల్, అశ్రఫ్, సింగం సత్తయ్యగౌడ్, శ్రీపతి రాజగోపాల్, సలీం పాల్గొన్నారు.