స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:21 PM
దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో త్యాగధనులు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు.
కోల్‌సిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో త్యాగధనులు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీపీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశాన్ని అన్నీ రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు.
పోలీసులు జాతి సమగ్రత, శాంతి, సమాజ స్థాపనకు దృఢ నిశ్చయంతో, నీతి నిజాయితీతో పని చేయాలన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. గోదావరిఖని ఏసీపీ రమేష్, ఎస్‌బీ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.