డ్రగ్స్ నిర్మూలనకు సంఘటితంగా పోరాడాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:17 AM
దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్న రాణి పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు, యువత భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు తమ వంతు కృషిచేసి డ్రగ్స్ నివారణకు పాటుపడాలని పేర్కొన్నారు.
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 9 (ఆంఽధ్రజ్యోతి): దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్న రాణి పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు, యువత భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు తమ వంతు కృషిచేసి డ్రగ్స్ నివారణకు పాటుపడాలని పేర్కొన్నారు. నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. న్యాయమూర్తి స్వప్న రాణితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. న్యాయమూర్తి స్వప్న రాణి మాట్లాడుతూ నేటి యువత కేవలం సరదాగా మొదలుపెట్టి, చివరికి తెలియకుండానే మత్తుకు అలవాటుపడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో అలవాటుగా మొదలైన ఈ వ్యసనం రానురాను ప్రాణాలను హరించే స్థాయికి చేరుతుందన్నారు.
డ్రగ్స్ సేవించడం వలన ఆరోగ్యం, విద్య, కుటుంబ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, మాదక ద్రవ్యాలకు బానిసైన వారు తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి డీ అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స పొందడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక,సామాజిక దుష్ప్రభావాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్,మహిళా శిశు సంక్షేమ శాఖ,న్యాయ సేవ సంస్థలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఏసీపీ గజ్జి క్రిష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ మల్లేష్, న్యాయవాది ఝాన్సీ, ఎఫ్‌ఆర్‌ఓ స్వర్ణలత, నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ఉమ,సఖి సీఏ స్వప్న, డీహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తోపాటు విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.