సర్పంచలుగా చేసి సర్వం కోల్పోయాం..
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:20 AM
పంచాయతీ ఎన్నికల పర్వంలో తొలి విడత నామినేషన్లుపూర్తయి మలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తరుణంలో గ్రామాలు రాజకీయాలతో వేడెక్కాయి. కొత్తగా సర్పంచలు కాదలచుకున్నవారు నూతనోత్సాహంతో కొనసాగుతుండగా.. అదే గ్రామాల్లో మాజీ సర్పంచలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పంచాయతీ ఎన్నికల పర్వంలో తొలి విడత నామినేషన్లుపూర్తయి మలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తరుణంలో గ్రామాలు రాజకీయాలతో వేడెక్కాయి. కొత్తగా సర్పంచలు కాదలచుకున్నవారు నూతనోత్సాహంతో కొనసాగుతుండగా.. అదే గ్రామాల్లో మాజీ సర్పంచలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. చేసిన అప్పులు తీరేదెలారా.. దేవుడా అంటూ కడుపులో దుఖాన్ని దాచుకోలేక కలిసిన వారికి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సర్పంచగా గెలిచినందుకు బాధ్యతగా ఎంతో కొంత అభివృద్ధి పనులు చేసి చూపించాలని, అవకాశం కలిసివస్తే ఆ పునాదులపై మళ్లీ నిచ్చెన్లు వేసుకొని అధికారాన్ని అందిపుచ్చుకోవాలని ఆశించారు.
ఫ నిధులు మంజూరయ్యాయని..
ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని ప్రకటనలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు అదేపనిగా మీడియాలో ప్రచారం చేశారు. దీంతో పోటీపడి తమ గ్రామాల అవసరాలను వారికి వివరించి రోడ్లకు, డ్రైనేజీలకు, సామాజిక భవనాలకు, పాఠశాలలకు, అంగనవాడీ భవనాలకు, ఇతర నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించుకున్నారు. ఎమ్మెల్యే, మంత్రులతో కలిసి కొబ్బరికాయలు కొట్టించుకొని, రిబ్బన్లు కట్ చేయించుకొని శంకుస్థాపనలు చేయించారు. అప్పోసప్పో తెచ్చి వాటిని పూర్తి చేసిన వారు కొందరైతే, ఇంట్లో ఉన్న డబ్బులు పెట్టి పూర్తి చేసినవారు మరికొందరు. ఇంట్లో ఆడవాళ్ల నగలు, భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని గ్రామాభివృద్ధి పనులు పూర్తి చేశారు. పనులు పూర్తి చేసేంత వరకు పరుగులు పెట్టించిన ప్రభుత్వం నిధులు లేవని చావుకబురు చల్లగా చెప్పింది. బడ్జెట్ రిలీజ్ చేయక, ఫ్రీజింగ్ విధించడతో రెండేళ్లుగా మాజీ సర్పంచులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. పదవీ కాలం పూర్తయి తాజా ఎన్నికలు వచ్చినా నిధుల విడుదలకు మోక్షం లభించలేదు. పనులు రికార్డు అయి ట్రెజరీలకు బిల్లులు వెళ్లినా డబ్బులు అందలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల హామీతో నిధులు మంజూరు కాకున్నా కొంతమంది పనులు పూర్తి చేశారు. ఆ పనులను బిల్లు రికార్డు చేసే అవకాశం లేకపోవడంతో వారికి డబ్బు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. పదవీకాలం పూర్తవడంతో ఆయా పనులపై పెట్టిన డబ్బుకు తిలోదకాలు ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
రూ.27 లక్షల బిల్లులు రావాలి..
- బింగి కరుణాకర్, మాజీ సర్పంచ, రంగాపూర్
హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ సర్పంచగా రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాను. 27 లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. గ్రామపంచాయతీలో నిధులు లేక పోవడంతో చెక్కులు క్లియర్ కాలేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాతనైనా బిల్లులు ఇవ్వాలి. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం.
ఫ అంతా అయోమయంగా ఉంది
- పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, మాజీ సర్పంచ, గన్నేరువరం
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అయోమయంగా ఉంది. గ్రామ అభివృద్ధికి సొంత నిధులతో వివిధ పనులు చేశాము. 32 లక్షల బిల్లులు రావలసి ఉంది.
రెండు ఎకరాల భూమిని పోగొట్టుకున్నా....
- ఎనగందుల సుదర్శన, మాజీ సర్పంచ, ఊటూరు
సొంత డబ్బులతో పలు అభివృద్ధి పనులు చేశా... నాకు 20 లక్షల బిల్లులు రావలసి ఉంది. గ్రామంలో పనులు చేసేందుకు రెండు ఎకరాల ఎనిమిది గుంటల వ్యవసాయ భూమిని అమ్ముకున్నా. తిరిగి సర్పంచు పదవికి పోటీ చేయాలని ఉన్నప్పటికి గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక పోవడంతో అప్పులు, వడ్డీ చెల్లించలేకనే ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలి.
రూ. 20 లక్షల వరకు అప్పు అయ్యింది...
- పొడిగా పద్మజ, మాజీ సర్పంచ, వెంకటేశ్వరపల్లి
సర్పంచగా గెలిచిన తర్వాత పలు అభివృద్ధి పనులు చేశా.. 20 లక్షల వరకు అప్పు అయ్యింది. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
ఫ భూమిని అమ్ముకోవడం బాధగా ఉంది.
- రేగుల సుమలత, మాజీ సర్పంచ, రాంచంద్రాపూర్
సర్పంచగా గెలిచిన తర్వాత అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాను. బిల్లులు రాక అప్పులు పెరిగిపోయాయి. అప్పలు తీర్చేందుకు రెండెకరాల భూమి అమ్ముకున్నా. సర్పంచగా పని చేశానన్న సంతోషం కన్నా భూమి అమ్ముకోవడం బాధగా ఉంది. 10 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావలసి ఉంది.
రూ. 1.45 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి..
- రొడ్డ పృథ్వీరాజ్, మాజీ సర్పంచ, మానకొండూరు
గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన దాదాపు కోటి 45 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కోటి 5 లక్షలు ఎంబీ రికార్డు కాగా, 40 లక్షలు ఇంకా రికార్డు కాలేదు. అన్ని బిల్లులు చెల్లించాలి.
ఫ డ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నా...
- పోతుల నరసయ్య, మాజీ సర్పంచ, రెడ్డిపల్లి
సర్పంచగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి 80 లక్షల బిల్లులు రావలసి ఉంది. ఈ పనులు పూర్తిచేసేందుకు తెచ్చిన అప్పులు, వాటి వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నా... ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలి.
బిల్లులు రాకుంటే ఆగమ్య గోచరమే
- కంది దిలీప్‌రెడ్డి, మాజీ సర్పంచ, వంతడపుల
గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తీసుకువచ్చి పనులు పూర్తి చేశాము.. 13 లక్షల బిల్లులు రావాలి. మా బిల్లుల పరిస్థితిపై ప్రభుత్వం ఆలోచించాలి. ఎకరం భూమి అమ్మి అప్పులు తీర్చాను. బిల్లులు రాకుంటే మా పరిస్థితి ఆగమ్యగోచరమే..
ఫ భూమి కుదవపెట్టి పనులు చేశా..
- ఉప్పులేటి ఉమారాణి, మాజీ సర్పంచ, వచ్చునూరు
గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి కుదవపెట్టి 10 లక్షల రూపాయల అప్పు తీసుకొని అభివృద్ధి పనులు చేశా. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ట్రెజరీలో చెక్కు వేశా... ఇప్పటి వరకు ఆ చెక్కు పాస్ కాలేదు. కొన్ని పనులకు సంబంధించినవి బిల్లులు ఎంబీ రికార్డు అయినప్పటికీ బిల్లులు ఇవ్వలేదు. ఇబ్బంది పెట్టకుండా బిల్లులు మంజూరు చేస్తే చాలు.
హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు..
- దామెర విద్యాసాగర్‌రెడ్డి, మాజీ సర్పంచ, ఆర్నకొండ
మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల డబ్బులు ఇచ్చిన తర్వాతే కొత్త సర్పంచలు పనులు చేయాలి. 28 లక్షల రూపాయల బిల్లులు రావలసి ఉంది. అందులో 14 లక్షల పనులకు సంబంధించి ఎంబి రికార్డు పూర్తయింది. మిగిలినవి ఇంకా రికార్డు చేయలేదు. బిల్లులు ఇవ్వలేదు. సర్పంచుల పెండింగ్ డబ్బులను చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బిల్లులు రాక ప్రైవేట్‌గా పని చేసుకుంటున్నా..
- చెప్పాల మమత, తాజామాజీ సర్పంచు ఉల్లంపల్లి, చిగురుమామిడి
మాకు రావలసిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం ఇవ్వక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. కరీంనగర్‌లో ప్రైవేట్‌గా పని చేసుకుంటున్నా. వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలి.
పనులు చేసినా పైసలు ఇవ్వలేదు..
- మోరె అనూష, మాజీ సర్పంచ, మొలంగూర్
సర్పంచగా గెలిచిన తర్వాత చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదు. 32 లక్షల వరకు నిధులు రావాలి. మిషన భగీరథ, రైతువేదిక, స్కూల్ బిల్డింగ్‌కు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నవి. వెంటనే వాటిని మంజూరు చేయాలి
బంగారం కుదవపెట్టి పనులు చేయించా..
- తాళ్ళ విజయలక్ష్మి, మాజీ సర్పంచ, లక్ష్మిదేవిపల్లి
అధికారుల ఒత్తిడి మేరకు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశాము. చేతిలో పైసలు లేకుంటే బంగారం కుదవపెట్టి స్మశానవాటిక, సెగ్రిగేషన షెడ్డు, సీసీ రోడ్లు వేయించాను. రెండేళ్లు అధికారుల చుట్టూ బిల్లుల కోసం తిరిగా. చివరకు విధిలేక 20 గుంటల వ్యవసాయ భూమి అమ్ముకొని అప్పులు చెల్లించాము. మరికొన్ని అప్పులు ఉన్నాయి. పదవి పోయాక అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో ఈ యేడాది జూనలో నా భర్త రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నాకు ఎనిమిది లక్షల బిల్లులు రావలసి ఉంది. వెంటనే వాటిని విడుదల చేసి ఆదుకోవాలి.