Share News

ఇచ్చిన మాట ప్రకారం రేషన్‌కార్డులు అందజేస్తున్నాం

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:51 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్క రేషన్‌ కార్డు కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించలేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. పట్టణంలోని నందన గార్డెన్‌లో నియోజకవర్గం వ్యాప్తంగా 4,847 మందికి మంగళవారం నూతన రేషన్‌ కార్డులు అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం రేషన్‌కార్డులు అందజేస్తున్నాం

పెద్దపల్లి టౌన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్క రేషన్‌ కార్డు కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించలేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. పట్టణంలోని నందన గార్డెన్‌లో నియోజకవర్గం వ్యాప్తంగా 4,847 మందికి మంగళవారం నూతన రేషన్‌ కార్డులు అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయారే తప్ప ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. గతంలో ఉన్న రేషన్‌ కార్డులలో 10 వేల 715 మంది సభ్యులను జత చేసినట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం 35 వేల 485 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కారు, ట్రాక్టర్‌ ఉందని రేషన్‌ కార్డు కోత పెట్టవద్దని, వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రేషన్‌ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసిందని విమర్శించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. దేశంలో సన్నబియ్యం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్‌ రెడ్డిని కొనియాడారు. గత యూపీఏ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులను, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొలగిస్తూ వస్తోందని ఆరోపించారు. అదనపు కలెక్టర్‌ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్లు, డిఎస్‌ఓ శ్రీనాథ్‌, తహసీల్దార్‌ రాజయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:51 PM