జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:07 AM
రైతుల్లో ఆశలు నింపుతూ భూగర్భ జలమట్టం పెరుగుతోంది. నైరుతిపై ఆశలు చాలించుకున్న రైతులకు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు ఆశాజనంగా మారాయి. ప్రస్తుత ఖరీఫ్ సాగుతో పాటు యాసంగి సాగుకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రైతుల్లో ఆశలు నింపుతూ భూగర్భ జలమట్టం పెరుగుతోంది. నైరుతిపై ఆశలు చాలించుకున్న రైతులకు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు ఆశాజనంగా మారాయి. ప్రస్తుత ఖరీఫ్ సాగుతో పాటు యాసంగి సాగుకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలు సగటు లోటు వర్షపాతాన్ని తీర్చాయి. జిల్లాలో 20 రోజులపాటు కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. గంగమ్మ పైపైకి చేరుతోంది. జిల్లాలో సగటు భూగర్భ జలాలు 7.60 మీటర్లకు ఖరీఫ్ దిగుబడి ఆశలు కల్పించింది. ఆగస్టులో విస్తారంగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సాగు పనుల్లో రైతుల సందడి కనిపిస్తోంది.
జిల్లాలో పెరిగిన జలమట్టం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 7.60 మీటర్ల వరకు వచ్చింది. 2024 సంవత్సరం ఆగస్టులో జిల్లాలో 8.15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ సంవత్సరం మే మాసంలో 11.01 మీటర్లు, జూలైలో 9.35 మీటర్లు, ఆగస్టులో 7.60 మీటర్లలో ఉన్నాయి. ఆగస్టులో కురిసిన వర్షాలు భూగర్భ జలాల సమృద్ధిని పెంచింది. ఇల్లంతకుంట మండలంలో 3.51 మీటర్లలోని భూగర్భ జలాలు ఉండగా, వేములవాడ అర్బన్ మండలంలో 15.55 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 573.5 మిల్లీమీటర్లు ఉండగా, 621.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 8.0 శాతం ఎక్కువగా ఉంది. అయితే రుద్రంగి మండలంలో లోటు వర్షపాతం ఉండగా, ఇల్లంతకుంట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పది మండలాల్లో సాధారణ వర్షపాతం ఉంది.
ఆశలు తీర్చిన జలాశయాలు
వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్టు, రంగనాయక సాగర్ వరకు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడితో సిరిసిల్ల మానేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 13420 క్యూసెక్కులు కొనసాగుతోంది. సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగులతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా వరద నీరు వస్తుంది. శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి 13220 క్యూసెక్కులు, మానేరు, మూలవాగుల నుంచి 200 క్యూసెక్కులు వస్తున్న నీటి ప్రవాహంతో మిడ్‌మానేరు ప్రాజెక్టులో 27.55 టీంఎంసీల సామర్థ్యానికి 26.042 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సిరిసిల్ల మానేరు బ్రిడ్జి వరకు మిడ్ మానేరు బ్యాక్ వాటర్ చేరింది. అన్నపూర్ణ ప్రాజెక్టు 12800 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతుంది. రంగనాయక సాగర్‌కు 6600 క్యూసెక్కులు నీళ్లు వెళ్లుతున్నాయి. జిల్లాలోని 656 చెరువుల్లో 133 చెరువులు మత్తడి దూకాయి. మిగతా చెరువులు కుంటల్లోకి భారీ వరద నీరు చేరింది.194 చెరువుల్లోకి మాత్రం 25 శాతం నీరు మాత్రమే చేరింది. భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావులు మాత్రం నిండుగా పోస్తున్నాయి.
2.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు
వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 235330 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి 1,84,310 ఎకరాలు, మొక్కజొన్న 3,748 ఎకరాలు, పత్తి 46,485 ఎకరాలు, కందులు 660 ఎకరాలు, పెసర 30 ఎకరాలు, ఇతర పంటలు 137 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో సాగుకు సంబంఽధించి మండలాల్లో గంభీరావుపేట మండలంలో 18,598 ఎకరాల్లో సాగు కాగా ఇల్లంతకుంటలో 36,970 ఎకరాలు, ముస్తాబాద్‌లో 23,835 ఎకరాలు, సిరిసిల్ల 5,623 ఎకరాలు, తంగళ్లపల్లి 21,086 ఎకరాలు, వీర్నపల్లి 8,300 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట 21,100 ఎకరాలు, బోయినపల్లి 19,167 ఎకరాలు, చందుర్తి 21,367 ఎకరాలు, కోనరావుపేటలో 23,140 ఎకరాలు, రుద్రంగి 10,964, వేములవాడ 10,038 ఎకరాలు, వేములవాడ రూరల్ 15,142 ఎకరాల్లో సాగు చేశారు.