చెరువులకు జల కళ..
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:11 AM
జిల్లాలో గడిచిన నెలలో వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువులకు జల కళ సంతరించుకుంది. ఆగస్టులో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదైన విషయం విదితమే. జిల్లా వార్షిక వర్షపాతం ఆగస్టు వరకు 238.7 మిల్లీమీటర్లు కాగా 319.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన నెలలో వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువులకు జల కళ సంతరించుకుంది. ఆగస్టులో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదైన విషయం విదితమే. జిల్లా వార్షిక వర్షపాతం ఆగస్టు వరకు 238.7 మిల్లీమీటర్లు కాగా 319.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్‌లోనూ ఇదే కొనసాగితే వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టులో 11 మండలాల్లో అధికంగా, 9 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆగస్టు మూడో వారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్, సారంగాపూర్, ధర్మపురి, బుగ్గారం, కొడిమ్యాల, వెల్గటూరు మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. జగిత్యాల రూరల్, జగిత్యాల, మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్, మల్యాల, భీమారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, చిన్న చిన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక జిల్లాలోని 600కు పైగా చెరువులు పూర్తిగా నిండాయి. పలు చోట్ల మత్తడి పారాయి. జిల్లా వ్యాప్తంగా 1,709 మంది రైతులకు చెందిన 2,168 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు.
ఫరెండు నెలలు వర్షాలు లేక..
వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందస్తు వర్షాలు రైతులను మురిపించాయి. రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. రెండు నెలలు ఆశించిన వర్షాలు లేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు బోసిపోయాయి. అడపాదడపా కురిసిన వర్షాలకు పంటలు సాగు చేయగా జూలైలో ఆశించిన వర్షాలు లేక వరినాట్లు వేయలేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నాట్లు వేశారు. విత్తుకున్న పంటలు వడలిపోయే దశకు చేరాయి. ఆగస్టు మొదటి వారం వరకు ఎండలు మండిపోయాయి. రెండో వారం నుంచి కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో నారు పోసుకొని నాట్లు వేశారు. అప్పటికే విత్తుకున్న పంటలకు ప్రాణం పోయగా వరి సాగుకు కలిసి వచ్చాయి. దాదాపు పది రోజుల పాటు ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు భారీగా పారింది. వారం రోజుల్లోనే అధిక వర్షపాతం నమోదై లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి పంటలకు నష్టాన్ని తెచ్చి పెట్టింది.
ఫపైపైకి భూగర్భ జల మట్టం..
జిల్లాలో జూలై నెలాఖరుకు 4.49 మీటర్లుగా ఉన్న సగటు జలమట్టం ఆగస్టు నెలాఖరు వచ్చేసరికి 3.61 మీటర్లుగా నమోదైంది. బీర్‌పూర్‌లో 0.46 మీటర్లు, బుగ్గారంలో 4.30, ధర్మపురిలో 2.59, ఎండపల్లిలో 8.10, గొల్లపల్లిలో 2.24, జగిత్యాల రూరల్‌లో 0.93, జగిత్యాల అర్బన్‌లో 5.65, పెగడపల్లిలో 2.12, రాయికల్‌లో 2.89, సారంగపూర్‌లో, 4.12, వెల్గటూరులో 2.98, కొడిమ్యాలలో 10.80, మల్యాలలో 5.66, ఇబ్రహీంపట్నంలో 2.83, కోరుట్లలో 7.55, మల్లాపూర్‌లో 4.59, భీమారంలో 1.78, కథలాపూర్‌లో 1.95, మేడిపల్లిలో 2.84, మెట్‌పల్లిలో 4.62 మీటర్లుగా భూగర్భ జలమట్టం నమోదైంది.
ఫవరి సాగు అధికంగా..
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 3,86,510 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,85,955 ఎకరాల్లో సాగు చేసి 99.86 శాతం నమోదైంది. ఇందులో ప్రధాన పంటగా వరి 3.13 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు. జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారడం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా సమృద్ధిగా నీరు అందుతుండడంతో సాగు మరింత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫజిల్లాలో రూ.58.27 కోట్ల వరద నష్టం
జిల్లాలో గడిచిన నెలలో కురిసిన వర్షాల వల్ల రూ.58.27 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వరదల వల్ల జరిగిన నష్టం పనులను తాత్కాలికంగా, శాశ్వతంగా పూర్తి చేయడానికి సంబంధిత నిధులు అవసరమని ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో 16 రహదారులకు రూ.1,765 లక్షలు, పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న 55.60 కిలోమీటర్ల రహదారులకు 1,963లక్షలు, ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిలకు రూ.70 లక్షలు, రోడ్లు భవనాల శాఖ పరిదిలోని మూడు ప్రాంతాల్లో రూ. 1,700 లక్షలు, విద్యుత్ పనులకు 11 కేవీ 0.90 లక్షలు, ఎల్‌టీ పనులకు 1.80 లక్షలు, డీటీఆర్ పనులకు 1.00 లక్షలు, విద్యా శాఖ ఆద్వర్యంలోని రూప్స్, ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, వాల్స్ 28 పనులకు రూ.149.45 లక్షలు, డీఎంహెచ్‌వో 8 పీహెచ్‌సీలకు రూ.26.50 లక్షలు, చిన్న నీటి వనరుల 3 పనులకు 21.75 లక్షలు, సంక్షేమశాఖ పరిధిలో 46 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.102.80 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ పనులకు రూ.25 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు.