Share News

వేతన వెతలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:12 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తూ మున్సిపాలిటీల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కా పద్దులు, బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యతలు చూసే ఆర్‌పీ (రిసోర్స్‌ పర్సన్‌)లకు వేతన వెతలు తప్పడం లేదు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేతన వెతలు

జగిత్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తూ మున్సిపాలిటీల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కా పద్దులు, బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యతలు చూసే ఆర్‌పీ (రిసోర్స్‌ పర్సన్‌)లకు వేతన వెతలు తప్పడం లేదు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళా సంఘలా బాధ్యతలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకునే ఆర్‌పీలకు చాలీచాలని వేతనం ఇస్తున్నారు. ఇది కూడా సకాలంలో అందించడం లేదు. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న 173 మంది ఆర్‌పీలు వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

నెలకు 600 నుంచి పని చేస్తున్న ఆర్‌పీలు....

రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం మెప్మా ఆర్‌పీలకు నెలకు 600 పారితోషకం అందించేది. ఆ తర్వాత ఆ పారితోషకాన్ని వెయ్యికి, తరువాత రెండు వేలకు పెంచుతూ వచ్చింది. 2018 నుంచి ఆర్‌పీలకు నెలకు రూ. 4 వేల వేతనం, పట్టణ సమాఖ్య నుంచి మరో రూ.2 వేలు కలిపి రూ. 6 వేల చొప్పున స్త్రీ నిధి ద్వారా చెల్లిస్తున్నారు. ఇచ్చే తక్కువ వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వకుండా స్త్రీ నిధి ద్వారా పారితోషకం పేరుతో ఇవ్వడాన్ని పలువురు ఆర్‌పీలు వ్యతిరేకిస్తున్నారు. గత బీఆర్‌స్‌ పాలనలో అనేక పర్యాయాలు మంత్రులు, కలెక్టర్లుకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసినా వారి సమస్య పరిష్కారం కాలేదు.

ఫ ఐదు నెలలుగా ఎదురుచూపులు

మెప్మా రిసోర్స్‌పర్సన్‌లు ఐదు నెలలుగా వేతనాల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, మెప్మా ఏఓ దుర్గపు శ్రీనివాస్‌ గౌడ్‌లకు మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు వినతిపత్రం అందించారు. ప్రస్తుత యేడాది మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై మాసాలకు చెందిన వేతనాలు అందించాలని కోరారు. వెంటనే గౌరవ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫఅదనపు బాధ్యతలతో సతమతం

మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మెప్మా ఆర్‌పీలకు అదనపు బాధ్యతలు భారంగా మారుతున్నాయి. పట్టణాల్లో స్వయం సహాయక మహిళా సంఘాల ఏర్పాటు, వాటి బలోపేతం, రుణాలు ఇప్పించడం, నిర్ణీత గడువుల్లో మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించి పలు తీర్మానాలు చేయిస్తుంటారు. వీధి వ్యాపారులను గుర్తించడం, గుర్తింపు కార్డులు అందించడం, బ్యాంక్‌ రుణాలు అందేలా సహకరించడం వంటి విధులను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఇతర వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు ముద్ర రుణాలు ఇప్పించడం, తదితర కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి తోడు క్షేత్ర స్థాయిలో సర్వేలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో రిసోర్స్‌ పర్సన్‌లు విధులు నిర్వహిస్తున్నారు. పరిశుభత్ర, పారిశుధ్యం, హరిత హారం, నిరక్ష్యరాస్యత నిర్మూలన తదితర కార్యక్రమాల్లో రిసోర్స్‌ పర్సన్‌ల సేవలను అధికారులు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లకు నెలకు రూ.15 వేతనం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సమస్య పరిష్కరించాలి

- రమ, జిల్లా మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ సంఘం అధ్యక్షురాలు

ప్రభుత్వం మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లకు ప్రతీ నెల సక్రమంగా వేతనాలు చెల్లించాలి. అరకొరగా ఇస్తున్న గౌరవ వేతనాలు సైతం ఎప్పటికప్పుడు అందించకపోవడంతో ఆర్థికంగా అవస్థలు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలు అందించాలి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

- దుర్గపు శ్రీనివాస్‌ గౌడ్‌, మెప్మా పరిపాలన అధికారి

మెపాలో పనిచేస్తున్న ఆర్‌పీల ఐదు నెలల వేతన బకాయిలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లాం. సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే మహిళా స్వయం సహాయక సంఘాల సమాఖ్యల ఖాతాల్లో జమ చేస్తాం. ఆయా ఖాతాల నుంచి ఆర్‌పీలు వేతనాలు అందుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Aug 17 , 2025 | 01:12 AM