నేడే ఓటింగ్... కౌంటింగ్...
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:28 PM
సుదీర్ఘ కాలం తర్వాత గ్రామ పంచాయతీ పోలింగ్ గురువారం జరగనుంది. తొలి విడత జిల్లాలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మంథని మండలంలోని 3, రామగిరి మండలంలో ఒక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మంథని, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కాలం తర్వాత గ్రామ పంచాయతీ పోలింగ్ గురువారం జరగనుంది. తొలి విడత జిల్లాలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మంథని మండలంలోని 3, రామగిరి మండలంలో ఒక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన వారిలో మెజార్టీ వార్డు సభ్యుల మద్దతులో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. మెజార్టీ ఉన్న వార్డు సభ్యుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికకానున్నారు. మెజార్టీ గ్రామ పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరి నుంచి మొదలుకొని నలుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. పార్టీ పరంగా ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించగా మిగితా వారంతా రెబల్‌గా పోటీలో ఉన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం ఐదు మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మధ్యాహ్నం బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లు, ఇతర సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో అధికార యంత్రాగం తరలివెళ్ళారు. సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. వీరికి పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలను సైతం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌలిక సదపాయాలు కల్పించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సర్పంచ్, వార్డు సభ్యుల, ఉప సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతుందటంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొననుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.