Share News

ఓటరు ‘కిక్కు’ అదిరింది..

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:26 AM

పంచాయతీ ఎన్నికల ఊపుతో పల్లెలు గమ్మత్తుగా ఊగిపోయాయి. షెడ్యూల్‌ వచ్చి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మందు, విందు దావతులతో జోష్‌గా పల్లెలు మునిగిపోయాయి. ఎన్నికలు ముగిసిన గెలిచిన ఉత్సాహంలో కొందరు, ఓడిన బాధలో మరికొందరు ఎక్సైజ్‌ శాఖ ఆదాయాన్ని పెంచుతున్నారు.

ఓటరు ‘కిక్కు’ అదిరింది..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికల ఊపుతో పల్లెలు గమ్మత్తుగా ఊగిపోయాయి. షెడ్యూల్‌ వచ్చి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మందు, విందు దావతులతో జోష్‌గా పల్లెలు మునిగిపోయాయి. ఎన్నికలు ముగిసిన గెలిచిన ఉత్సాహంలో కొందరు, ఓడిన బాధలో మరికొందరు ఎక్సైజ్‌ శాఖ ఆదాయాన్ని పెంచుతున్నారు. జిల్లాలో 48 మద్యం దుకాణాలకు టెండర్లు జరగగా వ్యాపారులు సిండికేట్‌గా మారి దక్కించుకున్నారు. మద్యం దుకాణాలు రాని వ్యాపారులు గుడ్‌విల్‌ కింద రూ కోటి వరకు చెల్లించి దుకాణాలు సొంతం చేసుకున్నారు. డిసెంబర్‌ 1న మొదలైన కొత్త దుకాణాల వ్యాపారులకు పంచాయతీ ఎన్నికలు కొత్త కిక్కును ఇచ్చింది. ఇప్పుడు పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల వైపు మద్యం వ్యాపారుల చూపు మళ్లింది. ఆశావహుల కంటే ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుందా అని మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ ఏర్పడింది.

ఎన్నికల కిక్కు రూ 42.83 కోట్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48మద్యం దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు తొలివిడత 11వ తేదీన, మలి విడత 14న, తుదివిడత 17న జరిగాయి. మూడు విడతల్లో ఎన్నికలు మూగిసే వరకు అభ్యర్థులు ప్రధానంగా మద్యం, విందు దావతులతోనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. జిల్లా ఎక్సైజ్‌ శాఖకు చివరి విడత ఎన్నికల వరకు రూ 38 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగితే ఆ తర్వాత జరిగిన విక్రయాలతో శుక్రవారం వరకు రూ 42.83 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. జిల్లాలో విస్కీ 38941 పెట్టెలు, బీర్లు 47596 పెట్టెల విక్రయాల ద్వారా రూ 42.83 కోట్ల వ్యాపారం జరిగింది. సిరిసిల్ల ఎక్సైజ్‌ సర్కిళ్లో రూ 16.42 కోట్లు, ఎల్లారెడ్డిపేట సర్కిల్‌లో 12.32 కోట్లు, వేములవాడ సర్కిల్లో రూ 14.09 కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబరు మాసం మొత్తంగా కలిపి రూ 53.72 కోట్ల వ్యాపారం జరిగింది. ఈసారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం అదే వరుసలో పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు కూడా రానుండడంతో వ్యాపారం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

పోయిన డబ్బులు.. వచ్చిన ఓట్లు

జిల్లాలో పంచాయతీ పదవుల ఆశ అభ్యర్థులను అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముగియడంతోనే వచ్చిన ఓటు,్ల పోయిన డబ్బులపైన అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డు సభ్యుల స్థానాల్లో 27 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 233 సర్పంచ్‌ స్థానాలు, 668 వార్డులు ఏకగ్రీవం కాగా, 1600 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌ స్థానాల్లో 953 మంది, వార్డు స్థానాల్లో 4245 అభ్యర్థులు పోటీ పడ్డారు. సర్పంచ్‌ అభ్యర్థులు రూ 50 లక్షల నుంచి రూ కోటి వరకు ఖర్చు చేశారు. వార్డు సభ్యులు రూ 10 లక్షల నుంచి రూ 15 లక్షల వరకు ఖర్చు చేశారు. చివరి క్షణంలో పదవిని దక్కించుకోవాలని తపనతో భారీగా ఖర్చులు చేశారు. జిల్లాలో ఎన్నికల ఖర్చు రూ 450 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. జిల్లాలో మద్యం విక్రయాలకు రూ 42.83 కోట్లు ఖర్చుచేశారు. దీంతో పాటు కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల నుంచి కూడా మద్యం వచ్చింది.

Updated Date - Dec 21 , 2025 | 12:26 AM