వినాయకా.. వీడ్కోలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:23 AM
నవరాత్రులు పూజలందుకొన్న గణనాథుడికి శుక్రవారం భక్తులు వీడ్కోలు పలికారు. గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి వద్దకు ఖనితోపాటు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన గణనాథులను నిమజ్జనం చేశారు.
పెద్దపల్లి: నవరాత్రులు పూజలందుకొన్న గణనాథుడికి శుక్రవారం భక్తులు వీడ్కోలు పలికారు. గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి వద్దకు ఖనితోపాటు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన గణనాథులను నిమజ్జనం చేశారు. గోదావరిఖని చౌరస్తా వద్ద శోభాయాత్రగా వచ్చిన గణపతులకు స్వాగతం పలికారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. గణపతి బొప్ప మోరియా....బోలో గణేష్ మహరాజ్‌కి జై నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. మహిళల కోలాటాలు...యువకుల నృత్యాలతో ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం ఉదయం వినాయకుడికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల వద్ద లడ్డు, ఇతర సామగ్రి వేలం నిర్వహించారు. భక్తులు పోటీపడి సొంతం చేసుకున్నారు. అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన వాహనాలపై గణపతి ప్రతిమలను ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, ఏకరూప దస్తులతో ఊరేగింపులు కనువిందు చేశాయి. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.