Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యూరియా రవాణా ప్రారంభం

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:13 PM

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) నుంచి యూరియా రవాణా ప్రారంభమైంది. సాంకేతిక అవరోధాలతో 45రోజులు ప్లాంట్‌ షట్‌డౌన్‌ అయ్యింది. మరమ్మతులు పూర్తి కావడంతో గురువారం నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యూరియా రవాణా ప్రారంభం

కోల్‌సిటీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) నుంచి యూరియా రవాణా ప్రారంభమైంది. సాంకేతిక అవరోధాలతో 45రోజులు ప్లాంట్‌ షట్‌డౌన్‌ అయ్యింది. మరమ్మతులు పూర్తి కావడంతో గురువారం నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభించారు. మొదటి రోజు ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే ఇచ్చారు. తెలంగాణకు ఈ నెల కేంద్ర ప్రభుత్వం 45వేల టన్నులు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి సరఫరా చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో హెచ్‌టీఆర్‌ వైఫల్యంతో ఆగస్టులో ప్లాంట్‌ షట్‌డౌన్‌ అయ్యింది. రోజుకు 3850టన్నుల ఉత్పత్తి సామర్థ్యంగల ప్లాంట్‌లో కేవలం 80శాతం మాత్రమే లోడ్‌ పెడుతున్నారు. రోజుకు 3200 నుంచి 3400టన్నులు యూరియా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు హెచ్‌టీఆర్‌ను బైపాస్‌ను చేసి ప్లాంట్‌ను నడుపుతున్నారు. కీలకమైన ఈ సమయంలో ఎలాంటి అవరోధాలు లేకుండా ప్లాంట్‌ను నడపాలని, ఉత్పత్తి సామర్థ్యం తక్కువైనా నడిపించాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.

దీంతో 2600టన్నుల యూరియా లోడ్‌తో ఉన్న రేక్‌ను మంచిర్యాలకు పంపారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా పడడంతో యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. పత్తి వంటి వాణిజ్య పంటలు వేసిన ప్రాంతాల్లో కూడా రెండో పంటగా మొక్క జొన్న వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటలకు యూరియా అవసరాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ముందస్తుగా యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వర్షాకాల సీజన్‌లో రైతాంగానికి యూరియా అవసరం ఉన్న సమయంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రైతాంగానికి ఊరట కలిగింది. అక్టోబరులో ఉమ్మడి నిజామాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాల్లో మొదటగా యూరియా అవసరాలు ఎక్కువగా ఉంటాయి.

Updated Date - Oct 03 , 2025 | 11:13 PM