Share News

ఖని ఆసుపత్రిలో అనధికారిక కట్టడాలు

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:56 PM

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మూడు గుంటల నర్సరీ స్థలం ఆక్రమించి దర్జాగా భవన నిర్మాణ పనులను చేస్తున్నారు. ఆసుపత్రి ప్రహరి తొలగించి నిర్మాణ పనులను మూడు రోజుల నుంచి కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రిటికల్‌ కేర్‌, ఫార్మసీ మధ్య ఉన్న నర్సరీ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారు.

ఖని  ఆసుపత్రిలో అనధికారిక కట్టడాలు

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మూడు గుంటల నర్సరీ స్థలం ఆక్రమించి దర్జాగా భవన నిర్మాణ పనులను చేస్తున్నారు. ఆసుపత్రి ప్రహరి తొలగించి నిర్మాణ పనులను మూడు రోజుల నుంచి కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రిటికల్‌ కేర్‌, ఫార్మసీ మధ్య ఉన్న నర్సరీ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇటు ఆసుపత్రి అధికారులకు సమాచారం లేకుండా నిర్మాణ పనులు చేస్తున్నప్పటికీ ఎవరూ అభ్యంతరం తెలుపకపోవడంతో దర్జాగా నిర్మాణ పనులు చేస్తున్నారు. మూడు గుంటల స్థలంలో క్యాంటీన్‌ కోసం నిర్మాణ పనులు చేస్తున్నామని కూలీలు చెబుతుండగా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టడాలు చేయడంపై ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థలంలో మూడు రోజులుగా నిర్మాణం చేస్తున్నప్పటికీ మున్సిపల్‌, ఆసుపత్రి వర్గాలు నిర్మాణం గుర్తించి తెలియదని చెబుతున్నారు. ఆసుపత్రి కోసం స్థలం లేక ఇబ్బందులు పడుతుండగా దర్జాగా నిర్మాణ పనులను చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసుపత్రి గోడను తొలగించి శారదానగర్‌లోని నర్సరీ స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాల నుంచే ఇటుక, సిమెంట్‌, ఇసుకతో పనులను వేగవంతంగా నిర్మిస్తున్నారు. ఈ స్థలం కింది నుంచి శారదానగర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నుంచి అశోక్‌నగర్‌కు వాటర్‌ సప్లై పైప్‌లైన్‌ వెళుతుంది. గతంలో ఈ స్థలంలో ఆసుపత్రి సిబ్బంది నర్సరీని ఏర్పాటు చేశారు. ఎవరికి తెలియకుండా ఆసుపత్రి గోడ కూల్చివేసి పనులు నిర్వహించడం, దీనిని అడ్డుకోకపోవడం వెనుక కొందరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్టు తెలుస్తుంది.

మాకు సమాచారం లేదు...

ఆర్‌ఎంఓ రాజు

ఆసుపత్రి ఆవరణలో అక్రమంగా నిర్మిస్తున్న భవనం గురించి తమకు తెలియదు. అది ఎవరు కడుతున్నారో సమాచారం లేదు. ఆసుపత్రి గోడ కూల్చివేసి నిర్మాణ పనులు చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆసుపత్రి నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే అక్రమంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై పూర్తి నివేదికను కలెక్టర్‌కు పంపుతాం.

Updated Date - Aug 24 , 2025 | 11:56 PM