రెండు సర్పంచ స్థానాలు ఏకగ్రీవం
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:09 AM
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే తిమ్మాపూర్, మానకొండూర్, చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నం మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. దీంతో అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించి, సర్పంచ, వార్డు సభ్యుల అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే తిమ్మాపూర్, మానకొండూర్, చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నం మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. దీంతో అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించి, సర్పంచ, వార్డు సభ్యుల అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఐదు మండల్లాలోని 113 గ్రామపంచాయతీల్లో రెండు సర్పంచ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1,046 వార్డుల్లో 202 వార్డులకు సింగిల్ నామినేషన్లు వచ్చాయి. తిమ్మాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని ఎనిమిది వార్డులు, మానకొండూర్ మండలంలోని 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
- తిమ్మాపూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో సర్పంచ స్థానాలకు 97 మంది పోటీలో ఉన్నారు. 212 వార్డుల్లో 38 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 174 వార్డుల్లో 539 మంది పోటీపడుతున్నారు.
- గన్నేరువరం మండలంలోని 17 గ్రామపంచాయతీలకు గోపాల్‌పూర్, పీచుపల్లి సర్పంచ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 56 మంది బరిలో ఉన్నారు. గోపాల్‌పూర్ సర్పంచగా ఆకుల కవిత (కాంగ్రెస్), పీచుపల్లిలో సామ రాజిరెడ్డి (బీజేపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని 140 వార్డులకు 48 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన వార్డుల్లో 254 మంది పోటీలో నిలిచారు.
- శంకరపట్నం మండలంలోని 27 గ్రామపంచాయతీల్లో సర్పంచ స్థానాలకు 111 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 240 వార్డులకు 48 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 192 వార్డుల్లో 493 మంది బరిలో నిలిచారు.
- మానకొండూర్ మండలంలోని 29 గ్రామాల్లో సర్పంచ పదవులకు 99 మంది పోటీలో ఉన్నారు. 280 వార్డుల్లో 55 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 225 వార్డుల్లో 641 మంది పోటీపడుతున్నారు.
- చిగురుమామిడి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో సర్పంచ పదవులకు 75 మంది పోటీలో ఉన్నారు. 174 వార్డుల్లో 13 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 161 వార్డుల్లో 467 మంది పోటీలో ఉన్నారు.
- మొదటి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లోని 92 గ్రామపంచాయతీలు మూడు సర్పంచు పదవులు ఏకగ్రీవమయ్యాయి. 89 సర్పంచు పదవులకు 438 మంది బరిలో ఉన్నారు. 866 వార్డుల్లో 270 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన వార్డుల్లో 1,581 మంది పోటీలో ఉన్నారు. మూడో విడతలో జరిగే గ్రామపంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది.
ఫ రెండు విడతల్లో ఐదు సర్పంచ స్థానాలు ఏకగ్రీవం
మొదటి విడతలో చొప్పదండి మండలం పెద్దకురుమపల్లి గ్రామ సర్పంచగా మావురం సుగుణ (ఇండిపెండెంట్), దేశాయిపేట సర్పంచగా వడ్లకొండ తిరుమల (ఇండిపెండెంట్), రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచగా ఒంటెల సుగుణమ్మ (బీఆర్‌ఎస్)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో విడతలో జరిగే గ్రామపంచాయతీల్లోని గన్నేరువరం మండలంలోని గోపాల్‌పూర్ సర్పందచగా ఆకుల కవిత (కాంగ్రెస్), పీచుపల్లి సర్పంచగా సామ రాజిరెడ్డి (బీజేపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు విడతల్లో ఈనెల 11, 14న జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఐదు సర్పంచు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఫ ఊపందుకున్న ప్రచారాలు :
మొదటి, రెండు విడతల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సర్పంచ, వార్డు స్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా ప్రచారాలపై దృష్టిపెట్టారు. ఎన్నికలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో వారికి ఎన్నికల అధికారులు కేటాయించిన గుర్తులతో ఓటర్లను కలిసి మద్దతు కూడగడుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి మద్దతు ఇచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటబెట్టుకొని ఓటర్లను కలుస్తున్నారు. అక్కడక్కడ రాత్రి వేళలో విందులతోపాటు మందు బాటిళ్లు, చికెన, మటన, బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. మరికొన్నిచోట్ల తమను గెలిపిస్తే అవి చేస్తాం... ఇవి చేస్తామంటూ హామీలు ఇస్తూ.. వారికి కావలసినవి నజరానాగా ఇస్తున్నారు.