పెండింగ్ సమస్యల పరిష్కారానికి టీఆర్‌టీఎఫ్ పోరాటం
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:48 PM
ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన టీఆర్టీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు.
సుల్తానాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన టీఆర్టీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత నిబంధనలు సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, టెట్ అంశంపై ఇప్పటికే సంఘ పక్షాన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన దాఖలు చేశామన్నారు. డిసెంబర్ 11న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నామన్నారు. ఈ లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఘం 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 21న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి విద్యాసదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీపీఎస్ ఒక దుర్మార్గమైన విధానమని దేశవ్యాప్తంగా దీన్ని రద్దుకు పోరాటాలే శరణ్యమన్నారు. ఈహెచ్‌ఎస్ పథకంలో నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఈ నెలాఖరుకల్లా ప్రకటించాలని, నూతన పీఆర్సీ అమలుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని నూతన విద్యావిధానం వచ్చే సంవత్సరం నుండి అమలు చేయడానికి సన్నద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి, విధివిధానాలపై ఒక ప్రణాళికతో ముందుకు సాగితే సత్ఫలితాలను సాధించగలమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జడ్పీ జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి మూడేళ్లుగా వడ్డీ జమ కాలేదని, ఉపాధ్యాయుల జీపీఎఫ్ స్లిప్స్ అందుబాటులో లేవన్నారు. దీర్ఘకాలిక అవసర నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకునే ఉపాధ్యాయులకు ఇది శరాఘాతంలా మారుతుందని పేర్కొన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
సమావేశ అనంతరం జిల్లా శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కాటక్వోజల సంతోష్ కుమార్‌లను ఎంపిక చేశారు. ఎన్నికల అధికారి ప్రభాకర్ రావు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి, టీఆర్టీఎప్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. టీఆర్టీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు మహేందర్ రెడ్డి, అశోక్ కుమార్, సంఘ సీనియర్ నాయకులు విఠల్, రేగురి శ్రీనివాస్, మహేష్, పలు మండలాల బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.