Share News

నగరంలో ట్రా‘ఫికర్‌’

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:05 AM

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వాహనాల రద్దీరోజురోజుకు పెరుగుతోంది. నగరం స్మార్ట్‌సిటీ కావడమేకాకుండా శివారులోని పద్మనగర్‌, చింతకుంట, మల్కాపూర్‌, రేకుర్తి, సీతారాంపూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌, సదాశివపల్లి, అల్గునూర్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి.

నగరంలో ట్రా‘ఫికర్‌’

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వాహనాల రద్దీరోజురోజుకు పెరుగుతోంది. నగరం స్మార్ట్‌సిటీ కావడమేకాకుండా శివారులోని పద్మనగర్‌, చింతకుంట, మల్కాపూర్‌, రేకుర్తి, సీతారాంపూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌, సదాశివపల్లి, అల్గునూర్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి. నగర విస్తీర్ణం, జనాభాతోపాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఒకపుడు ప్రధాన రహదారులకే పరిమితమైన వాహనాల రద్దీ, ఇప్పుడు అంతర్గత రోడ్లలో కూడా ఏర్పడింది.

ఫ యథేచ్చగా ఆక్రమణలు

ప్రధాన రోడ్లలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని దర్జాగా ఓవైపు పండ్లు, మిర్చి బండ్లు, టిఫిన్‌, పానీపురి బండ్లు, ఇతర చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తున్నారు. చాలా చోట్ల దుకాణదారులు వారి దుకాణాలకు సంబంధించిన బోర్డులను, కొంత మంది అమ్మకాలకు సంబంధించిన వస్తువులను ఫుట్‌పాత్‌, రోడ్లపై పెడుతున్నారు. దీనికితోడు ఆయా దుకాణాలకు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాలకు వచ్చే వారు వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడంతో రోడ్లు చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రైవేట్‌ స్కూల్స్‌, కళాశాలల బస్సులు ఎక్కడ పడితే అక్కడ నిలిపి విద్యార్థులను తీసుకెళ్లడం, వదిలిపెడుతుండడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

ఫ ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్‌

నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్లపైనే స్కూల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌తోపాటు వైన్‌ షాపులు, మద్యం దుకాణాలకు కూడా అనుమతి ఇవ్వడంతో వాటికి పార్కింగ్‌ స్థలం లేక రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో కూడా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓవైపు ద్విచక్రవాహనాలు, మరోవైపు స్కూల్‌బస్సుల, ఇంకోవైపు ఆటోలు, కార్లు ఇలా రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇప్పటికే మంకమ్మతోట పాత లేబర్‌ అడ్డా, కమాన్‌ జంక్షన్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఎదుట ఉన్న రోడ్లను వన్‌వేగా మార్చారు.

ఫ బిజీగా మారిన యూనివర్సిటీ రోడ్డు

శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో గత ఏడాది నగరపాలక సంస్థ నైట్‌ ఫుడ్‌ కోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో ఇక ఆ రోడ్డు పగలు, రాత్రి అనే తేడా లేకుండా బిజీగా మారింది. ఓవైపు వాహనాల రద్దీ, మరోవైపు కొంత మంది యువకులు సాయంత్రం, రాత్రి వేళల్లో చెవులు చిల్లులు పడే విధంగా శబ్దంతో బైక్‌ రైడింగ్‌ చేస్తున్నారు. దీంతో వాహనదారులేకాకుండా పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్‌ రోడ్డు, కట్టరాంపూర్‌, హనుమాన్‌నగర్‌రోడ్డు, హౌసింగ్‌బోర్డుకాలనీ రోడ్డు, కాపువాడ రోడ్డు, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌ కాలనీ, టెలిఫోన్‌ క్వార్టర్స్‌ రోడ్ల మధ్య డివైడర్లు లేక పోవడంతో వాహనాలు అడ్డుదిడ్డంగా నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై నగరపాలక సంస్థ, పోలీస్‌ శాఖలు అధ్యయనం చేసి ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాద నివారణకు స్టాపర్లు, స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. సైలెన్సర్లు మార్చి నడిపే బైకులను, బైక్‌ రేస్‌లను నియంత్రించాలని రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:05 AM