నేడే మలి విడత పోరు
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:41 AM
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని జగిత్యాల, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 144 గ్రామ పంచాయతీలు, 1,276 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 330 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 134 సర్పంచ్ స్థానాలకు 521 మంది అభ్యర్థులు, 946 వార్డులకు 2,662 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
జగిత్యాల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని జగిత్యాల, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 144 గ్రామ పంచాయతీలు, 1,276 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 330 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 134 సర్పంచ్ స్థానాలకు 521 మంది అభ్యర్థులు, 946 వార్డులకు 2,662 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
జిల్లాలో మలి విడత పంచాయతీల్లో 2,12,092 మంది ఓటర్లున్నారు. ఇందులో జగిత్యాలలో 9,727 మంది, జగిత్యాల రూరల్‌లో 46,020 మంది, రాయికల్‌లో 39,412 మంది, సారంగపూర్‌లో 20,466 మంది, బీర్‌పూర్‌లో 17,738 మది, మల్యాలలో 40,307 మది, కొడిమ్యాలలో 38,422 మంది ఓటర్లున్నారు.ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌ల పర్యవేక్షణలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏడు మండలాల్లో ఎన్నికలు..
జిల్లాలో మలి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆయా మండలాల్లో 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్ మండలంలో 5 సర్పంచ్, 50 వార్డులు, జగిత్యాల రూరల్ మండలంలో 29 సర్పంచ్, 268 వార్డులు, రాయికల్ మండలంలో 32 సర్పంచ్, 276 వార్డులు, సారంగపూర్ మండలంలో 18 సర్పంచ్, 144 వార్డులు, బీర్‌పూర్ మండలంలో 17 సర్పంచ్, 136 వార్డులు, మల్యాల మండలంలో 19 సర్పంచ్, 186 వార్డులు, కొడిమ్యాల మండలంలో 24 సర్పంచ్, 216 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
1,276 పోలింగ్ కేంద్రాలు..
జిల్లా వ్యాప్తంగా మలి విడత పంచాయతీ ఎన్నికల సందర్బంగా 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జగిత్యాలలో 50 పోలింగ్ కేంద్రాలు, జగిత్యాల రూరల్‌లో 268, రాయికల్‌లో 276, సారంగపూర్‌లో 144, బీర్‌పూర్‌లో 136, మల్యాలలో 186, కొడిమ్యాలలో 216 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,534 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఇందులో జగిత్యాలలో 60, జగిత్యాల రూరల్‌లో 322, రాయికల్‌లో 331, సారంగపూర్‌లో 173, బీర్‌పూర్‌లో 164, మల్యాలలో 224, కొడిమ్యాలలో 260 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. 100 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 36 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల సదుపాయాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ సిబ్బంది..
జిల్లాలో మలి విడతలో 1,531 మంది పీఓలు, 2,044 మంది ఓపీఓలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందులో జగిత్యాల అర్బన్‌లో 60 పీఓలు, 101 ఓపీఓలు, జగిత్యాల రూరల్‌లో 322 పీఓలు, 444 మంది ఓపీఓలు, రాయికల్‌లో 331 పీఓలు, 406 మంది ఓపీఓలు, సారంగపూర్‌లో 173 మంది పీఓలు, 215 మంది ఓపీఓలు, బీర్‌పూర్‌లో 163 మంది పీఓలు, 210 ఓపీఓలు, కొడిమ్యాలలో 259 పీఓలు, 347 మంది ఓపీలు విధులు నిర్వర్తించనున్నారు. పలువురు నోడల్ అధికారులు, స్టేజ్ - 1 రిటర్నింగ్ ఆఫీసర్లు, స్టేజ్-1 ఏఆర్‌ఓలు, స్టేజ్-2 ఆర్‌ఓలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందం అధికారులు పనిచేయనున్నారు.
ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి
-కలెక్టర్ సత్యప్రసాద్
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ సిబ్బందికి పంపిణీ కేంద్రాల నుంచి మెటీరియల్ అందించాము. సంబంధిత పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ప్రారంభిస్తాం. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.