నేడు అనంత పద్మనాభస్వామి వ్రతం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:17 AM
అనంత పద్మనాభస్వామి వ్రతానికి భక్తులు సన్నద్ధమవుతున్నారు. యేటా బాధ్రపద శుక్ల చతుర్ధశి రోజు జరుపుకునే వ్రతం అనంత చతుర్ధశి వ్రతం, అనంత పద్మనాభ వ్రతంగా పిలుస్తారు. ఈ వ్రతాన్ని శనివారం జరుపుకోనున్నారు. మానవులు తనను అనంత సంసార సంద్రంలో నుంచి ఉద్ధరించమని అనంత పద్మనాభుడిని వేడుకుంటారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): అనంత పద్మనాభస్వామి వ్రతానికి భక్తులు సన్నద్ధమవుతున్నారు. యేటా బాధ్రపద శుక్ల చతుర్ధశి రోజు జరుపుకునే వ్రతం అనంత చతుర్ధశి వ్రతం, అనంత పద్మనాభ వ్రతంగా పిలుస్తారు. ఈ వ్రతాన్ని శనివారం జరుపుకోనున్నారు. మానవులు తనను అనంత సంసార సంద్రంలో నుంచి ఉద్ధరించమని అనంత పద్మనాభుడిని వేడుకుంటారు. అలా వేడుకొంటూ చేసే వ్రతమే అనంత పద్మనాభస్వామి వ్రతం. అనంతుడు అంటే ఆదిశేషుడు. విష్ణువునకు అనంత శయనుడు అని పేరు. కాలానికి, ఆది శేషుడికి, విష్ణువునకు అవినాభావ సంబంఽధాన్ని తెలిపే ఈ వ్రతం ఎందరికో ఆరాధ్యంగా మారింది.
నీరుకుల్లలో ప్రత్యేక పూజలు
నీరుకుల్లలోని భూ నీలసమేత రంగనాయక స్వామి ఆలయంలో శనివారం పద్మనాభస్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ వ్రతాలకు దేవాదాయ శాఖతోపాటు ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా నీరుకుల్లలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంత పద్మనాభ వ్రతాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ వ్రతాలు జరుపుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు సరిహద్దు రాష్ర్టాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తారు. రంగనాయక స్వామి వారు శయనించిన విగ్రరూపకంగా ఉంటే, కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారిని పోలిన విధంగా స్వామి ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తారు. మానేటి నది ఒడ్డున స్వయంభూగా వెలసి మానేటి రంగనాథుడిగా ప్రసిద్ది చెంది పూజలందుకుంటున్నాడు. శనివారం చతుర్ధశి ఉదయం 6.30 నుంచి అనంత పద్మనాభ వ్రతం, కోటి వత్తుల నోము నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్రతాలు అనంతరం భక్తులు పెద్ద మట్టి పాత్రతో కూడిన ప్రమిదలో కోటి వత్తులు వేసి నెయ్యితో తడిపి వెలిగిస్తారు. వ్రతం సందర్భంగా స్వామి వారికి నూతన వస్ర్తాలు సమర్పించడం, ధానధర్మాలు చేస్తారు. భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో శంకర్ తెలిపారు.