నేడు సద్దుల బతుకమ్మ
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:20 PM
జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డలు జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలను తీర్చదిద్దనున్నారు. కొనుగోళ్ళతో కూడళ్లు రద్దీగా మారాయి...
పెద్దపల్లి కల్చరల్/మార్కండేయకాలనీ/కళ్యాణ్‌నగర్, సెప్టెంబరు28(ఆంధ్రజ్యోతి): రామా రామా రామా... ఉయ్యాలో... రామనే శ్రీ రామ ఉయ్యాలో... అంటూ తెలంగాణ సంస్కృతి సంప్రదయాలకు అద్దం పట్టే మహిళల సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వసిద్ధమయ్యింది.. జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డలు జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలను తీర్చదిద్దనున్నారు. కొనుగోళ్ళతో కూడళ్లు రద్దీగా మారాయి... పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు ట్యాంక్ బండ్‌పై బతుకమ్మల ఆటకు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో బాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ, సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.
రంగు రంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే.... తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మలను చెరువులు, నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పాటల్లో మహిళల తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బందుత్వం, అప్యాయతలు ఉంటాయి. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోతున్న గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతారు.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్ని మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్దనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ బిడ్డను మోసే నవమాసాలు ప్రతీక కావున దీనిని సంతాన సాఫల్యత పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.
కిటకిటలాడిన మార్కెట్లు
రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీలలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. పారిశ్రామిక ప్రాంతం పరిసర గ్రామాల నుంచి గ్రామస్థులతో పాటు వివిధ పూల వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి క్వింటాళ్ల కొద్ది రకరకాల పూలను శనివారం నుంచి దిగుమతి చేసుకున్నారు. పెద్ద ఎత్తున పూలను ఆటోలు, వ్యాన్‌లు, ట్రాక్టర్లలో తీసుకువచ్చారు. మహారాష్ట్ర పర్బాని, కరీంనగర్, చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బంతిపూలు దిగుమతి అయ్యాయి. ప్రధానంగా గోదావరిఖనిలోని ప్రధానచౌరస్తాతో పాటు రమేష్‌నగర్ చౌరస్తా, తిలక్‌నగర్ చౌరస్తా, ఫైవింక్లయిన్‌చౌరస్తాలలో పూల అమ్మకాలు చేస్తున్నారు. బతుకమ్మకు ప్రత్యేకమై తంగెడు, గుమ్మడి పూలు, గునుగు, సీతమ్మ జడ, తామర పువ్వులు, లిల్లీపూలు, చామంతి, బంతి పూలు క్వింటాళ్ళ కొద్ది దిగుమతి చేసి అమ్ముతున్నారు. ధరలు మాత్రం ఆకాశన్నంటాయి. కిలో బంతి పూలు రూ.80 నుంచి రూ.100 పలుకగా, కేవలం 100గ్రాముల చామంతి రూ.50 పలికింది. పూల అమ్మకాలతో ప్రధానచౌరస్తా - శివాజీనగర్, ఫైర్‌స్టేషన్, షాపింగ్ కాంప్లెక్స్ వెనుక రోడ్డు రద్దీగా మారాయి. సింగరేణి, రామగుండం కార్పొరేషన్, కార్పొరేటర్లు, ఇతర స్వచ్చంధ సంస్థలు బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నాయి. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు కోదండ రామాలయంతో పాటు గోదావరినది వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.