మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో పులి సంచారం
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:02 AM
సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభాకర్ సూచించారు. పులి సంచరిస్తున్న మేడిపల్లి ఓసీపీ గని ప్రాంతంలో మంగళవారం ఆయన పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
గోదావరిఖని, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభాకర్ సూచించారు. పులి సంచరిస్తున్న మేడిపల్లి ఓసీపీ గని ప్రాంతంలో మంగళవారం ఆయన పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం శ్రీరాంపూర్ నుంచి గోదావరినది దాటి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి ప్రవేశించింది. ఆదివారం గ్రామస్థుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు.
సోమవారం పులి సంచరించిన ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ప్రభాకర్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య, ఇతర అధికారులు పులి అడుగులను గుర్తించి సమీప గ్రామాలమైన మేడిపల్లి, లింగాపూర్, పాములపేట, మల్కాపూర్, విలేజీ రామగుండం, జనగామ, గంగానగర్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మేడిపల్లి ఓసీపీ మూసి వేసిన తరువాత ఆ ప్రాంతమంతా అడవిగా మారడంతో రెండు రోజులుగా పెద్దపులి ఆ ప్రాంతంలో సంచరిస్తుంది. మేడిపల్లి ఓసీపీ వెస్ట్ చెక్‌పోస్టు వద్ద ఫారెస్టు అధికారులు పులి అడుగులను గుర్తించారు. ఫారెస్ట్ ట్రాకర్స్ బృందం, సింగరేణి రెస్క్యూ బృందం పులి జాడ కోసం ప్రయత్నం చేసింది. రెండు సంవత్సరాల క్రితం జీడీకే 1ఇంక్లైన్ బొగ్గుగని ప్రాంతంలో చిరుత పులి సంచరించింది. ఇప్పుడు పెద్దపులి మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టులో తిరుగుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.