Share News

రామగుండంలో మూడు మద్యం షాపుల ఎత్తివేత

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:56 PM

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వ్యాపారాన్ని మించి మద్యం షాపులు ఉన్నాయని, సరైన వ్యాపారం సాగడం లేదనే కారణంగా మూడు మద్యం షాపులను ఎత్తివేశారు. గోదావరిఖనిలో రెండు, యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతానికి చెందిన ఒక షాపును ఎత్తివేసి హైదరాబాద్‌ బాల్‌నగర్‌కు రెండు, కుద్బుల్లాపూర్‌కు ఒకటి కేటాయించారు.

రామగుండంలో మూడు మద్యం షాపుల ఎత్తివేత

కోల్‌సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వ్యాపారాన్ని మించి మద్యం షాపులు ఉన్నాయని, సరైన వ్యాపారం సాగడం లేదనే కారణంగా మూడు మద్యం షాపులను ఎత్తివేశారు. గోదావరిఖనిలో రెండు, యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతానికి చెందిన ఒక షాపును ఎత్తివేసి హైదరాబాద్‌ బాల్‌నగర్‌కు రెండు, కుద్బుల్లాపూర్‌కు ఒకటి కేటాయించారు. గతంలో 23మద్యం షాపులు ఉండగా ఈ సారి 20షాపులకు కుదించారు. కార్పొరేషన్‌ పరిధిలోని 60డివిజన్లను రెండు సెక్టార్లుగా విభజించారు. 1వ సెక్టార్‌ 8షాపులు, 2వ సెక్టార్‌లో 12షాపులు పెట్టారు. ఒకటవ సెక్టార్‌ పరిధిలో 1 నుంచి 9డివిజన్లు, 24 నుంచి 37డివిజన్లు కేటాయించారు. రామగుండం పట్టణం, ఎన్‌టీపీసీ ఏరియా, గంగానగర్‌, బస్టాండ్‌ ఏరియా, హనుమాన్‌ తదితర ప్రాంతాలు ఈ సెక్టార్‌ పరిధిలోకి వస్తాయి. సెక్టార్‌-2లో 10వ డివిజన్‌ నుంచి 23వ డివిజన్‌, 38వ డివిజన్‌ నుంచి 60వ డివిజన్‌లను కేటాయించారు. మార్కండేయకాలనీ, అడ్డగుంటపల్లి, గౌతమినగర్‌ ఏరియా, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, శివాజీనగర్‌, ఫైవింక్లయిన్‌, రమేష్‌నగర్‌, తిలక్‌నగర్‌ విఠల్‌నగర్‌తో పాటు యైుటింక్లయిన్‌లను ఈ సెక్టార్లను చేర్చారు. రూ.65లక్షలు యేటా లైసెన్స్‌ ఫీజుగా నిర్ణయించారు. ఇందులో సెక్టార్‌-1 పరిధిలోని షాపు నెం.3, షాపు నెం.4, షాపు నెం.7ఎస్‌సీలకు కేటాయించగా, షాపు నెం.8 గౌడ్‌లకు కేటాయించారు. సెక్టార్‌-2 పరిధిలో షాపు నెం.2, షాపు నెం.4లను గౌడ్‌లకు కేటాయించారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మద్యంపాలసీ లాభదాయకంగా ఉండడంతో కార్పొరేషన్‌ పరిధిలోని పలు షాపులు లాభాల బాటలో ఉన్నాయి. గతంలో కొందరు మద్యం వ్యాపారులు నష్టాలు వచ్చాయని భాగస్వాములకు తప్పుడు లెక్కలు చూపించడంతో వ్యాపారులు గొడవ పడడం, ఠాణాల్లో ఫిర్యాదులు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గోదావరిఖని పట్టణంలోని ఒక మద్యం దుకాణానికి సంబంధించి ఇప్పటికే ఠాణాలో భాగస్వాములు ఫిర్యాదు చేశారు. గోదావరిఖనిలో మూడు షాపులు తగ్గడం, ఎన్‌టీపీసీలో కొత్తగా యూనిట్లు మంజూరు కావడం, సమ్మక్క - సారలమ్మ జాతర, కార్పొరేషన్‌ ఎలక్షన్స్‌ దృష్టిలో ఉంచుకుని ఈ సారి మద్యం షాపులకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారు రూ.15కోట్ల వ్యాపారం ఇతర షాపులకు మరలనున్నది. దీంతో మద్యం షాపులకు టెండర్లు దాఖలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అంతర్గాం, గోదావరిఖనిలోని నెం.44 షాపునకు దరఖాస్తులు దాఖలయ్యాయి.

Updated Date - Sep 29 , 2025 | 11:56 PM