దంచి కొడుతున్న ఎండలు..
ABN , Publish Date - May 04 , 2025 | 12:00 AM
ఎండలు దంచి కోడుతున్నాయి.. సూర్యుడి ప్రతాపానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైనే నమోదవుతూ ఆరెంజ్ జోన్‌లో సిరిసిల్ల నిలుస్తోంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఎండలు దంచి కోడుతున్నాయి.. సూర్యుడి ప్రతాపానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైనే నమోదవుతూ ఆరెంజ్ జోన్‌లో సిరిసిల్ల నిలుస్తోంది. జిల్లాలో మండలాల్లో ప్రాంతాల వారీగా ఎండ తీవ్రత వేర్వేరుగా ఉంటోంది. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా వాతావరణ శాఖ లెక్కలు వేస్తూ హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.8 డిగ్రీలు నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లాలో ఉదయం 9 దాటిందంటేనే ఎండ వేడికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లో జన సంచారం లేక ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. శనివారం మధ్యాహ్నం జిల్లాలో రుద్రంగిలో 43.8, చందుర్తిలో 43.7, కోనరావుపేటలో 43.7, ఎల్లారెడ్డిపేటలో 43.7, గంభీరావుపేటలో 43.7, వేములవాడ రూరల్‌లో 43.6, బోయినపల్లిలో 43.6, వీర్నపల్లిలో 43.3, ఇల్లంతకుంటలో 41.8, ముస్తాబాద్‌లో 41.6, సిరిసిల్లలో 41.5, వేములవాడలో 41.1, తంగళ్లపల్లిలో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండ మండలానికో తీరు..
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ గరిష్ఠ ఉష్ణోగ్రత 43.8 దాటింది. మండలాలు, ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉంటాయి. ఎండను ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికార యంత్రాంగం లెక్కిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21వెదర్ స్టేషన్లు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణం, పెద్దూర్, కోనరావుపేటలో మర్తనపేట, చందుర్తిలో మర్రిగడ్డ, వేములవాడ రూరల్‌లో వట్టెంల, మల్లారం, వీర్నపల్లి మండంలో వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలంలో నేరేళ్ల, ఇల్లంతకుంట మండలంలో కందికట్కూర్, ఇల్లంతకుంట, పెద్దలింగాపూర్, ముస్తాబాద్ మండలం అవునూర్, నామాపూర్, వేములవాడ మండలంలో నాంపల్లి, కోనరావుపేట మండలంలో నిజామాబాద్, రుద్రంగి మండలంలో రుద్రంగి, మానాల, గంభీరావుపేట మండలంలో గజసింగవరం, గంభీరావుపేట, బోయినపల్లి మండలంలో బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డిపేటల్లో ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో తెలంగాణ డెవలప్‌మెంట్, ప్లానింగ్ సోసైటీ(టీజీడీపీఎస్) నిర్వహణలో జిల్లాల వారీగా సగటు ఉష్ణోగ్రతలు లెక్కిస్తుంది. ఉష్ణోగ్రతల్లో 45 డిగ్రీలు వస్తే హెచ్చరికగా, 40-45 డిగ్రీలు వస్తే అప్రమత్తం, 35-40 జాగ్రత్త, 35ఉంటే హెచ్చరికలేనిదానిగా గుర్తిస్తారు. ఉష్ణోగ్రత లెక్కలను బట్టి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడం, దానికి అనుగుణంగా చర్యలు చేపడుతారు. ఆరెంజ్ అలర్ట్‌లో పేర్కొన్న జిల్లాలో పలు సూచనలు చేస్తుంటారు.
నిర్మానుష్యంగా ప్రాంతాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉంటే పాతబస్టాండ్, గాంధీచౌక్, పెద్దబజార్, కూరగాయల మార్కెట్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, వెంకంపేట ప్రాంతాలు మధ్యాహ్నం వేళల్లో నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.1డిగ్రీల నుంచి 43.8 డిగ్రీల వరకు వివిధ వెదర్ స్టేషన్‌లలో నమోదైంది. వైద్యులు ప్రజలు బయటకు వెళ్లే ముందు జాగ్రతలు పాటించాలని సూచిస్తున్నారు. తెలుపు రంగు పలుచటి వస్త్రాలు ధరించాలని, తలపై టోపీ, లేదా రుమాలు చుట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ వంటివి తాగాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే చల్లటి ప్రాంతానికి తీసుకవెళ్లాలని తడిగుడ్డతో శరీరం అంతా తుడుస్తూ ఉండాలని, వైద్య సేవలందించాలని సూచిస్తున్నారు. ఎండనుంచి ఇంటికి రాగానే నిమ్మరసం, కొబ్బరినీళ్లు, నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. చర్మం పొడిబారకుండా చూసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా, శరీరంలో తేమ కోల్పోకుండా చూసుకోవాలని, మాయిశ్చరైజింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు..
- కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఎండలతో అప్రమత్తంగా ఉండాలి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అకాల వర్షాల వల్ల భూమి నుంచి వేడి వస్తుంది. ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటించాలి. ఎండ అధికంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రాకూడదు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. వడదెబ్బ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నారులు, వయోవృద్ధులతో ప్రయాణం శ్రేయస్కరం కాదు. వడదెబ్బ నుంచి ఉపశమనం కోసం తరచూగా ఓఆర్‌ఎస్ ద్రావణం, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. అలసట, నోరు ఎండిపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలి. అత్యవసర వైద్య సేవలకు 108కు ఫోన్ చేయాలి.