ప్రారంభమైన సమ్మక్క - సారలమ్మ మొక్కులు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:04 AM
రెండేళ్లకో సారి వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర సందడి కోల్ బెల్ట్‌లో నెల రోజుల ముందు నుంచే మొదలైంది. జనవరి 27, 28, 29తేదీల్లో సమ్మక్క జాతర జరగనుంది. కోల్‌బెల్ట్ ప్రాంతంలో ప్రతీ ఇంటిలో వన దేవతలను కొల వడం ఆనవాయితీ.రెండు రోజుల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క-సాలరమ్మ మొక్కులు మొదలయ్యాయి.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రెండేళ్లకో సారి వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర సందడి కోల్ బెల్ట్‌లో నెల రోజుల ముందు నుంచే మొదలైంది. జనవరి 27, 28, 29తేదీల్లో సమ్మక్క జాతర జరగనుంది. కోల్‌బెల్ట్ ప్రాంతంలో ప్రతీ ఇంటిలో వన దేవతలను కొల వడం ఆనవాయితీ.రెండు రోజుల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క-సాలరమ్మ మొక్కులు మొదలయ్యాయి. ఎత్తు బంగారం(బెల్లం), మేకలు, కోళ్లు బలిచ్చి తమ కుటుంబాన్ని కాపాడాలని, వన దేవతలు చల్లగా చూడాలంటూ మొక్కులు చెల్లిస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొమురవెళ్లి మల్లన్న, కొండగట్టు అంజన్నస్వామి, ఓదెల మల్లన్నకు మొక్కులు చెల్లించి ఇంట్లో సమ్మక్క చేసుకుని మొదటికి మేడారంకు వెళ్లి మొక్కులు అప్పగించి వస్తారు. నెల రోజుల నుంచే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సందడి మొదలైంది. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారు ఆ వనదేవతలు చల్లగా చూడాలంటూ ఎత్తు బంగారం సమర్పించడంతో పాటు ఇంటి పక్కల వారికి, బంధువులకు బెల్లం పంచుతారు. అంతేకాకుండా మేక, కోడితో మొక్కులు చెల్లించి బంధు మిత్రులతో సమ్మక్కను జరుపుకుంటారు. దీంతో మేకలు, కోళ్లు, బెల్లం వ్యాపారాలు ఊపందుకున్నాయి. కళ్యాణ్‌న గర్‌లో ఉన్న మేకల మండి వద్ద మేకల కోసం బారులు తీరుతున్నారు. సాధారణ రోజులకంటే జాతర సంద ర్భంగా వ్యాపారులు మేకల ధరలను పెంచారు. కిలో బెల్లం ధర రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. కోళ్ల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి.