పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:27 PM
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, ప్రజలకు సేవలందించడానికి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీస్‌శాఖ ముందుకు వెళుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, ప్రజలకు సేవలందించడానికి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీస్‌శాఖ ముందుకు వెళుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషరేట్ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌తో పాటు అమరుల కుటుంబాలు నివాళులర్పించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 24గంటలు ప్రజలకు సేవలందించేది పోలీస్‌శాఖ అని, ప్రజల కోసం తమ ప్రాణాలను పోలీసులు అర్పించారన్నారు.
పోలీస్ అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎళ్లప్పుడూ మన గుండెల్లో ఉంటారని, అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఏ సమస్య వచ్చినా పోలీస్‌శాఖ అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్‌తో పాటు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.