కుట్ర పూరితంగానే యాజమాన్యం లాభాలు ప్రకటించడం లేదు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:57 PM
సింగరేణిలో కుట్ర పూరితంగానే 2024-25 ఆర్థిక సంవత్సరం లాభాలను యాజమాన్యం ప్రకటించడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంగళవారం సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా లోని జీడీకే11 ఇంక్లైన్‌లో జరిగిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు.
గోదావరిఖని, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కుట్ర పూరితంగానే 2024-25 ఆర్థిక సంవత్సరం లాభాలను యాజమాన్యం ప్రకటించడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంగళవారం సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా లోని జీడీకే11 ఇంక్లైన్‌లో జరిగిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఆగస్టు 24న బోర్డు సమావేశంలో జరిగిన విషయాన్ని ఈనెల 12న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించాలని, 35శాతం వాటా త్వరగా చెల్లించాలని, అదేవిధంగా గత సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్ల అమలుకు సర్క్యులర్‌లు జారీ చేయాలని అడిగితే యాజమాన్యం సమాధానం చెప్పకుండా దాటవేసిందన్నారు. అందుకే స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. టీబీజీకేఎస్ హయాంలో ఆరేడు సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఏఐటీయూసీ సింగరేణిలో కోర్టుకు వెళ్లి ఎన్నికలు పెట్టించి, గెలిచిన తరువాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని స్ట్రక్చర్ సమావేశాల్లో, ఒక సారి సీఎండీ స్థాయి జరిగిన సమావేశాల్లో చర్చ జరిగి కొన్ని డిమాండ్‌లను అంగీకరించిన యాజమాన్యం ఆరు నెలలు గడిచినా వాటి అమలు కోసం సర్క్యులర్‌లు జారీ లేదని ఆయన ఆరోపించారు.
సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు రంగు శ్రీను, ఎస్ వెంకట్‌రెడ్డి, సిద్దమల్ల రాజు, సయ్యద్ సోహేల్, గండి ప్రసాద్, ఎం చక్రపాణి, చెప్యాల భాస్కర్, గోసిక మోహన్, కే కనకరాజ్, ఎంఎ గౌస్, నాయిని శంకర్, గొడిశెల నరేశ్, జాన్ కెనడి, రియాజోద్దీన్, మానాల శ్రీనివాస్, బలుసు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్, బీ సమ్మయ్య, పొన్నం రంజిత్, ఉప్పులేటి తిరుపతి, దొడ్డిపల్లి రవి, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.