నిలిచిన ‘స్థానికం’
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:34 AM
రాష్ట్ర ఎన్నికల కమిషన్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం 10.30కు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా హైకోర్టు ఈ నోటిఫికేషన్‌పై ఆరు వారాలు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర ఎన్నికల కమిషన్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం 10.30కు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా హైకోర్టు ఈ నోటిఫికేషన్‌పై ఆరు వారాలు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్‌లోని ఆరు మండలాలకు చెందిన ఆరు జడ్పీటీసీ స్థానాలకు, 70 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఈనెల 27న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో అమలుపై, ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన కోర్టు, పిటీషనర్లకు దానికి జవాబు ఫైల్ చేసేందుకు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు జీవో అమలు, ఎన్నికల నిర్వహణపై స్టే ఉత్తర్వులు కొనసాగనున్నాయి.
నామినేషన్లు కొనసాగుతండగానే హైకోర్టు తీర్పు
జిల్లాలో తొలి విడత జరిగే హుజూరాబాద్ డివిజన్‌లో నామినేషన్ల మొదటిరోజు గురువారం సైదాపూర్ మండల జడ్పీటీసీ స్థానానికి ఒకరు, శంకరపట్నం మండలంలోని మెట్‌పల్లి, కన్నాపూర్ ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు వేశారు. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే హై కోర్టు ఆరువారాల గడువు ఇస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న ఆశావహులందరూ ఢీలా పడిపోయారు. ఆరు వారాల తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతాయో, కోర్టు ఏ ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠతో ఉన్న వారు హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
- జీవీ రామకృష్ణారావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
బీసీ వర్గాలను నిరాశకు గురిచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 9పై హైకోర్టు స్టే ఇవ్వడం రాష్ట్రంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్న రోజునే మంత్రి వర్గ సభ్యులను హైకోర్టు, సుప్రీంకోర్టులకు పంపిస్తూ తాను జీవోకు అనుకూలంగా తీర్పురావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రజల్లో తప్పుడు భావన సృష్టించారు. తెలంగాణ సమాజం సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పటికీ క్షమించదని అన్నారు. న్యాయస్థానంపై ఎలాంటి నింద వేయొద్దు. న్యాయమూర్తులు చట్టం, రాజ్యాంగం ప్రకారం తీర్పు ఇచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ సర్కార్
- కొట్టె మురళికృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం పాలయ్యే అవకాశముంది. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుల్లో హడావుడి చేస్తూ అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే రాజకీయాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల జరగవని వారి పార్టీ కేడర్‌కు, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారన్నారు. కోర్టులో కేసులు వేయించింది, ఫీజులు చెల్లించింది కూడా కాంగ్రెస్ నాయకులే..
బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్
- గుంజపడుగు హరిప్రసాద్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు
నామమాత్రపు చర్యలతో జీవో జారీ చేసి బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. లోపభూయిష్టమైన విధానాలతో కాంగ్రెస్ బీసీలకు రావలసిన 42శాతం రిజర్వేషన్లు రాకుండా కుట్రలు చేస్తోంది. 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండరాదు. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది. ఈ విషయం తెలిసి కూడా 42శాతానికి జీవో ఇస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో 9ని జారీ చేసింది.
లోపభూయిష్టంగా జీవో 9 జారీ
- పొలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబరు 9 పూర్తిగా లోపభూయిష్టంగా ఉండడంతో హైకోర్టులో ప్రభుత్వం ఆభాసు పాలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సైదాపూర్ జడ్పీటీసీ, శంకరపట్నంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు
సైదాపూర్/శంకరపట్నం అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సైదాపూర్ జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళ కేటాయించారు. గురువారం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లంకదాసరి అరుణ తరుపున ఆమె భర్త లంకదాసరి మల్లయ్య సైదాపూర్ జడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శంకరపట్నం మండంలో ఎంపీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దాఖలైనట్లు ఎంపీడీవో కృష్ణప్రసాద్ తెలిపారు. కన్నాపూర్ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి కుమార్ నామినేషన్ వేయగా, ఆర్వో మోహన్‌రావు స్వీకరించారు. మెట్‌పల్లి ఎంపీటీసీ స్థానానికి గొట్టె మధు కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి నామినేషన్ వేయగా, ఆర్వో వెంకటనర్సింహారెడ్డి స్వీకరించారు.