ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పనుల జాతర
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:10 AM
గ్రామీణ ప్రాంత ప్రజల వ్యక్తిగత, సామూహిక అవసరాలు తీర్చే పనులు చేపట్టడం కోసమే పనుల జాతరను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ట్ర పంచాయతీ రాజ్ జాయింట్ కమిషనర్ ఆరేపల్లి శ్రీనివాస్ అన్నారు. గర్రెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఆయన పనులకు శంకుస్థాపనలు చేసి పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సుల్తానాబాద్, ఆగస్టు 22: (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజల వ్యక్తిగత, సామూహిక అవసరాలు తీర్చే పనులు చేపట్టడం కోసమే పనుల జాతరను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ట్ర పంచాయతీ రాజ్ జాయింట్ కమిషనర్ ఆరేపల్లి శ్రీనివాస్ అన్నారు. గర్రెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఆయన పనులకు శంకుస్థాపనలు చేసి పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఆయన మాట్లాడుతు గ్రామాలలో ప్రజలకు కావల్సిన అవసరాలను గుర్తించడం, భవిష్యత్తులో కావాల్సిన వాటిని మంజూరు చేయడానికి శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను ప్రారంభించినట్లు వివరించారు.
స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా పనులను ఎంపిక చేశారన్నారు. వీటిలో పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫారాలు, పాఠశాల మరుగుదొడ్లు, వర్మీ కంపోస్టు గుంతలు, చెక్ డ్యాంలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సెగ్రిగేషన్ షెడ్లు, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు ఉన్నాయన్నారు. పనుల జాతరలో ప్రారంభించిన పనులు రానున్న ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లెపల్లి జానీ, మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి లక్ష్మన్ గ్రామస్తులు పాల్గొన్నారు.