‘సాగు’ లక్ష్యం.. నెరవేరుతోంది
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:52 AM
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నదాతల ఆశలకు ఊపిరినిస్తున్నాయి. వ్యవసాయ శాఖ వానాకాలం సీజన్ పంటల సాగు అంచనా లక్ష్యం నెరవేరుతోంది. ఇప్పటికే అంచనాకు మించి రైతులు వరి నాట్లు వేసుకున్నారు. రోహిణి కార్తెతోనే రుతుపవనాల ఆగమనంతో వానాకాలం రైతులను ముందస్తుగా మురిపించింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నదాతల ఆశలకు ఊపిరినిస్తున్నాయి. వ్యవసాయ శాఖ వానాకాలం సీజన్ పంటల సాగు అంచనా లక్ష్యం నెరవేరుతోంది. ఇప్పటికే అంచనాకు మించి రైతులు వరి నాట్లు వేసుకున్నారు. రోహిణి కార్తెతోనే రుతుపవనాల ఆగమనంతో వానాకాలం రైతులను ముందస్తుగా మురిపించింది. ఆ తర్వాత మోస్తారుతో పాటు చిరుజల్లులే కురిశాయి. దీంతో రైతులు ఎన్నోఆశలతో వానాకాలం సాగు పనులు ప్రారంభించారు. ఆశించిన వర్షాలు లేకపోవడంతో సాగుపై తీవ్రప్రభావం పడింది. అల్పపీడిన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో మళ్లీ పంటలపై భరోసా పెరిగింది. వరి, పత్తి ఇతర పంటల సాగు పెరిగింది. జిల్లాలో వానాకాలంలోలో 2,43,773 ఎకరాలు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. సీజన్ ప్రారంభంలో కొత్త ఇబ్బంది పడ్డా ప్రస్తుతం లక్ష్యం చివరి దశకు చేరుకుంది. జిల్లాలో ఇప్పటివరకు 2,36,305 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి, పత్తితో పాటు మొక్కజొన్న 3,713 ఎకరాలు, కందులు 660 ఎకరాలు, పెసర 30 ఎకరాలు, ఇతర పంటలు 77 ఎకరాల్లో సాగు చేశారు.
చివరికి ఆశలు...
జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరినాట్లు మందకొడిగా సాగాయి. రైతులు కూడా నారుమడులు సిద్ధం చేసుకున్న నాట్లు వేసుకోలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అల్పపీడనంతో కురిసిన వర్షాలు వరిసాగుపై ఆశలు పెంచాయి. వ్యవసాయ శాఖ అంచనాకు మించి వరిసాగు చేశారు. జిల్లాలో 1,84,860 ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా ఇప్పటికే 1,85,560 ఎకరాలు సాగు చేశారు. వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
తెల్ల బంగారానికి ఊపిరి..
వర్షాకాలం ప్రారంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించి పత్తి రైతులు ముందస్తుగా విత్తనాలు వేసుకున్నారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. రైతులు ఆవేదన చెందుతుండగా అల్పపీడనంతో వర్షాలు పడుతుండడంతో తెల్ల బంగారంగా భావించే పత్తి పంటకు ఊపిరినిస్తున్నాయి. జిల్లాలో 49,760 ఎకరాల్లో పత్తి సాగు అంచనాలకు గాను ఇప్పటి వరకు 46,205 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు కలుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రాజెక్ట్‌లకు జలకళ
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్ట్‌లకు జలకళ వచ్చింది. జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మోస్తారుగా వర్షం కురిసింది. శనివారం ఉదయం వరకు సగటు వర్షపాతం 16.0 మిల్లీమీటర్లు నమోదయింది. శనివారం మధ్యాహ్నం వరకు వర్షం పడింది. మళ్లీ పొడి వాతావరణమే ఏర్పడింది. జిల్లాలో రుద్రంగి, చందుర్తి మండలంలో 18.3 మిల్లీమీటర్లు, వేములవాడలో 17.8 మిల్లీమీటర్లు, బోయిన్‌పల్లిలో 15.5 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 15.3 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 15.0 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 13.5, సిరిసిల్లలో 12.5 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 11.5 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 9.5 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 8.8, తంగళ్లపల్లిలో 8.0 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 7.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీనికి తోడుగా సిరిసిల్ల మానేరు, వేములవాడ మూల వాగుల నుంచి వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. మిడ్ మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు ఉండగా 9.718 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా 12,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మానేరు మూల వాగుల నుంచి 9,450 క్యూసెక్కుల నీరు వస్తోంది. అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 30 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. 3.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 1.34టీఎంసీల నీరు ఉంది. ఎగువ మానేరు ప్రాజెక్టులో 2.0 టీఎంసీలకు గాను 1.34 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 925 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.