నేటితో ముగియనున్న తొలివిడత ప్రచారం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:44 PM
పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. తొలి విడతలో జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లోని 99 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.
మంథని, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. తొలి విడతలో జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లోని 99 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 4 గ్రామ పంచాయతీలో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 48 గంటల ముందే ఎన్నిక ప్రచారాన్ని ముంగించాల్సి ఉండగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ప్రచారానికి తెరదించాల్సి ఉంది. మరో వైపు మంగళవారం సాయంత్రం నుంచే ఎన్నికలు జరిగే మండలాల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు మద్యం షాపులను మూసి వేస్తున్నారు. వారం రోజులుగా ఎన్నికల ప్రచారం చేసిన పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నట్లు సమాచారం. ఓటర్ల మచ్చిక చేసుకోవటానికి ఎన్నికల మందు రోజు రాత్రి, తెల్లవారుజామున మద్యం, నగదు పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మరో వైపు అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లల్లో నిమగ్నమై ఉంది. పోలింగ్ నిర్వహించే పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇచ్చారు. మండలాన్ని జోన్లు, రూట్లుగా విభజించారు. పోలింగ్ సామగ్రిని మండల కేంద్రంలో ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రాల్లో డిస్టిబ్యూషన్, రికవరీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 10న ఉదయం నుంచి పోలింగ్ సామగ్రి, ఉద్యోగులను గ్రామ పంచాయతీలకు తరలించనున్నారు.
బ్యాలెట్ పేపర్‌పై తొలిసారి నోటాకు చోటు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా బ్యాలెట్ పేపర్ నోటాకు చోటు కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందకు నిలబడిన అభ్యర్థులు వారికి నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని ఈసీ కల్పించింది. ఇప్పటి వరకు పార్లమెంట్, ఆసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లలో మాత్రమే పొందు పరచగా తొలి సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై నోటాను చేర్చారు.
మండలంలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం..
మంథని మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో ఈనెల 11 పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయటానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం 324 మంది పోలింగ్ ఆఫీసర్లు, 250 మంది అసిస్టెంట్ పోలీంగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. మండలాన్ని 4 జోన్లుగా, 11 రూట్లుగా విభజించారు. 34 మందిని గ్రామ పంచాయతీ రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించారు. స్థానిక ప్రభుత జూనియర్ కళాశాల భవనంలో పోలింగ్ సామగ్రిని భద్రపరిచారు. ఇదే కళాశాల గ్రౌండ్‌లో డిస్టిబ్యూషన్, రీకవరీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 10న ఇక్కడి నుంచి 19 బస్సుల్లో పోలింగ్ సామగ్రిని, 600 మంది పోలింగ్ సిబ్బంది, 100 మంది పోలీసు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
కార్యదర్శుల పై ఆర్థిక భారం..
పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో కార్యదర్శుల పై ఆర్థిక భారం పడుతుంది. సర్పంచ్ తోపాటు వార్డు స్థానాలకు వేర్వురుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటి వద్ద ఓటర్ల కోసం వేసే టెంట్లు, కుర్చీలు, బెంచీలు, మంచినీటి సదుపాయాల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో కార్యదర్శులే ప్రస్తుతం ఖర్చులు భరించే పరిస్థితి ఉంది. ప్రతీ కార్యదర్శికి రూ. 5 వేల పైనే ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంది. కలెక్టర్ స్పందించి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాల్సి ఉంది.