కోల్ డిపోల ఏర్పాటు విరమించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:55 PM
సింగరేణి యాజమాన్యం కోల్‌డిపోలు ఏర్పాటు చేసి తమ బతుకులను రోడ్డు పాలు చేయడానికి కుట్రలు పన్నుతుందని, దీనిని విరమించుకోవాలని రామగుండం లారీ యజమాలను సంఘం అధ్యక్షుడు కందూరి శ్రీనివాస్‌రెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజమాన్యం కోల్‌డిపోలు ఏర్పాటు చేసి తమ బతుకులను రోడ్డు పాలు చేయడానికి కుట్రలు పన్నుతుందని, దీనిని విరమించుకోవాలని రామగుండం లారీ యజమాలను సంఘం అధ్యక్షుడు కందూరి శ్రీనివాస్‌రెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40సంవత్సరాలుగా సింగరేణి నుంచి వివిధ కంపెనీలకు బొగ్గు రవాణా చేస్తున్నామని, ఇక్కడ 6వేల కుటుంబాలు లారీలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. సింగరేణి యాజమాన్యం కోల్ డిపోల ఏర్పాటు వల్ల తాము నష్టపోతామన్నారు. గనుల నుంచే బొగ్గు రవాణా జరుపుతున్నామని, ఆ విధానాన్ని తీసివేయాలని యాజమాన్యం కుట్రలు చేస్తుందని, దీంతో సింగరేణి వ్యాప్తంగా 25లారీల సంఘాలు, దాని కింద ఉన్న లారీ యజమానుల బతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉందన్నారు. వినియోగదారులు సింగరేణిలో ఈ యాక్షన్ ద్వారా బొగ్గును కొనుగోలు చేసి తమకు రవాణా బాధ్యతలను అప్పగించేదని, తాము గనుల నుంచి కంపెనీలకు రవాణా చేసేవారమని, సింగరేణి యాజమాన్యం కొన్ని లోపాలతో తమకు బొగ్గురవాణా ఇవ్వకుండా డిపోలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తీసుకువస్తున్నారన్నారు. తాము అప్పు చేసి లారీలు కొనుక్కున్నామని, డిపోలు ఏర్పాటు చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని, దీనిపై సీఎండీ బలరాంనాయక్ పునరాలోచించి లారీ యజమానులకు న్యాయం చేయాలని కోరారు. నాయకులు బాబురావు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, లచ్చయ్య, తిరుపతి, కుమారస్వామి, తరుణ్ కుమార్, శ్రీనివాస్, రాజయ్య, వెంకటేష్, శ్రీధర్ పాల్గొన్నారు.