Share News

బీసీలను కాంగ్రెస్‌ పార్టీ దగా చేస్తున్నది

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:39 AM

రాష్ట్రంలో బీసీలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తున్నదని, 10 శాతం ముస్లింలను కలుపుకుని ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, మొత్తం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.

బీసీలను కాంగ్రెస్‌ పార్టీ దగా చేస్తున్నది

పెద్దపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తున్నదని, 10 శాతం ముస్లింలను కలుపుకుని ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, మొత్తం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఆయనకు పార్టీ శ్రేణులు కమాన్‌ వద్ద గజమాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎంబీ గార్డెన్‌కు చేరుకున్నారు. సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ పాలన, కాంగ్రెస్‌ పాలనలు చూసి విసుగెత్తి పోయారని, బీజేపీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసింది కాంగ్రెస్‌ కాదని బీజేపీయేనని అన్నారు. పలుసార్లు జైళ్లకు వెళ్లామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో రైతులు, విద్యార్థులు, మహిళలు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం యూరియాను బ్లాక్‌ చేస్తూ కొరతను సృష్టిస్తుందని ఆరోపించారు. ఎరువులపై ప్రధాని మోదీ లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తుంటే, కాంగ్రెస్‌ పార్టీ రైతులకు చేరకుండా బ్లాక్‌ చేస్తున్నదన్నారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల నిధులను ఇచ్చిందన్నారు. మూతపడ్గ ఎఫ్‌సీఐని ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునర్నించి యూరియాను అందిస్తున్నామని అన్నారు. ఎన్టీపీసీ ద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే గాకుండా, టీఎస్‌టీపీపీ ద్వారా 1600 మెగావాట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది ఏమి లేదన్నారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను క్షమించవద్దన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పి 6 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నారన్నారు. రేషన్‌ బియ్యం కేంద్రం ఇస్తే, తాము ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని ఢిల్లీకి వెళ్లి నాటకాలు ఆడుతూ దగా చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ పట్ల అప్రమత్తం గా ఉండాలని రాంచందర్‌ రావు ప్రజలను కోరారు. జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చిన్నమైల్‌ అంజి రెడ్డి, మల్క కొమురయ్య, జిల్లా ప్రభారి మాజీ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌ నేత, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణా రెడ్డి, కాసిపేట లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బీజేపీ జాతీయ దళిత మోర్చా నాయకులు ఎస్‌ కుమార్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ గొమాసే శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కుల సురేష్‌ రెడ్డి, శిలారపు పర్వతాలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి, కందుల సంధ్యారాణి, కన్నం అంజయ్య, పార్టీ నాయకులు మీస అర్ణున్‌ రావు, కోమల అంజనేయులు, సోమారపు లావణ్య, పల్లె సదానందం, చక్రధర్‌ రెడ్డి, తంగెడ రాజేశ్వర్‌ రావు, తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ నేత నల్ల మనోహర్‌ రెడ్డి..

బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నల్ల మనోహర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు సమక్షంలో పార్టీలో చేరడంతో కండువాలు కప్పి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నల్ల మనోహర్‌ రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నల్ల ఫౌండేషన్‌ స్థాపించి నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన బీజేపీలో చేరారు.

Updated Date - Aug 06 , 2025 | 12:39 AM