ప్రభుత్వాన్ని బదునాం చేసేందుకే కేంద్రం కుట్ర
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:15 AM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదునాం చేసేందుకే కేంద్రం తెలంగాణకు యూరియా కేటాయింపులు చేయడం లేదని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్ నోముల వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ధర్మారం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదునాం చేసేందుకే కేంద్రం తెలంగాణకు యూరియా కేటాయింపులు చేయడం లేదని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్ నోముల వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత యూరియా కావాలి, ఎన్ని దఫాల్లో అందించాలనే విషయం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పినప్పటికి యూరియా పంపకుండా కుట్ర పన్నుతుందన్నారు. యూరియా విషయంలో ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీతో పాటు ఇతర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో యూరియా కొరత గురించి తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. యూరియా కొరత గురించి బీఆర్‌ఎస్ నాయకులు అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్‌సీ సమీపంలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్‌వాడి భవనానికి, కేజీబీవి పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మించే డార్మెంటరీకి శంకుస్థాపన చేశారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై మంత్రి ఆగ్రహం
అంగన్‌వాడి భవనానికి భూమి పూజ చేయడానికి వెళ్తున్న మంత్రి అడ్లూరికి అదే సమయంలో ప్రాఽథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులు కనిపించారు. వెంటనే అక్కడ వడ్డిస్తున్న అన్నం కూరలను చూసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి సన్న బియ్యమేనా అని వంట మనిషిని ఆరా తీయగా కొన్నిరోజులుగా దొండు బియ్యాన్నే పాలిష్ చేసి పంపిస్తున్నారని బదులిచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే డీఎస్‌ఓకు ఫోన్ చేసి మాట్లాడారు. రేపటిలోగా సన్న బియ్యం అందించాలని, శనివారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని డీఎస్‌ఓకు సూచించారు. అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.