‘బోనస్’ రాకపాయె..!
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:58 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి నాట్లు చివరి దశకు చేరుకుంటున్నాయి. వానాకాలం సీజన్లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావించిన రైతులకు సన్న రకం ధాన్యం బోనస్ డబ్బులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా సన్న రకం ధాన్యం బోనస్ డబ్బుల జాడే లేదు. మరోవైపు రైతులకు వరిసాగు భారంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి నాట్లు చివరి దశకు చేరుకుంటున్నాయి. వానాకాలం సీజన్లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావించిన రైతులకు సన్న రకం ధాన్యం బోనస్ డబ్బులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా సన్న రకం ధాన్యం బోనస్ డబ్బుల జాడే లేదు. మరోవైపు రైతులకు వరిసాగు భారంగా మారింది. ఒకవైపు వానాకాలం పంటల సాగు పెట్టుబడి పెరిగింది. దీనికి తోడుగా ఎరువుల ధరలు కూడా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటల సాగుకు ఉపయోగపడుతుందని సన్నరకం వైపు మొగ్గు చూపిన రైతులకు సకాలంలో బోనస్ డబ్బులు రాకపోవడంతో ఆవేదన మిగిలిస్తోంది. జిల్లాలో ఇప్పటికే వానకాలం సీజన్లో 1.84 లక్షల ఎకరాల వరి సాగులో 1.45 లక్షల ఎకరాలు నాట్లు వేసుకున్నారు. నాట్లు చివరి దశకు వచ్చిన యాసంగికి సంబంధించిన సన్న రకం ధాన్యం బోనస్ డబ్బులు మాత్రం రావడం లేదు. అయినా జిల్లా రైతులు సన్నరకం వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో దొడ్డు రకం వరి సాగుతో పాటు పదివేల ఎకరాలకు పైగా సన్న రకం ధాన్యం పండించే దిశగా నాట్లు వేసుకుంటున్నారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో తప్పనిసరిగా సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సన్న రకం ధాన్యానికి ఆదరణ ఉండడంతో రైతులు గతంలో కంటే ఎక్కువగా సన్న రకం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ మాత్రం సకాలంలో ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
సన్నాల వైపు మొగ్గు..
సన్నరకం వరి సాగు వైపు రైతులను మళ్లించే దిశగా గత వానకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం సన్నాల వైపు మొగ్గు చూపారు. ఈసారి యాసంగి ధాన్యం కొనుగోల్లు జిల్లాలో పూర్తిచేసిన సన్న రకం వడ్లు క్వింటాలుకు రూ.500 చొప్పున ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కోసం మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. వానాకాలం సీజన్లో రైతులు సన్న వడ్లను మిల్లర్లు, వ్యాపారులకు నేరుగా విక్రయించారు. ఈసారి యాసంగి సన్న రకం ధాన్యం మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. కానీ బోనస్ ఎప్పుడు వస్తుందా అని రైతులకు ఎదురుచూడక తప్పడం లేదు. జిల్లాలో యాసంగి సీజన్లో 244 కొనుగోలు కేంద్రాల ద్వారా 44767 మంది రైతుల నుంచి రూ 627.50 కోట్లు విలువైన 2.70 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 2.61 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం 9554 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం దాన్యంలో ఐకెపి ద్వారా 7561 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 1588 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 104 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1255 మంది రైతులు సన్నరకం బోనస్‌కు అర్హులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బోనస్ బకాయిలు రూ 4.62 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో సాగు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43వేల 783 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు.. వరి సాగు లక్షా 84 వేల 860 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల వరకు వివిధ సాగు చేశారు. ఇందులో వరినాట్లు 1.45 లక్షల ఎకరాలు, పత్తి 45,900 ఎకరాలు, మొక్కజొన్న 3,923 ఎకరాలు, కందులు 572 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు.
యాసంగిలో విక్రయించిన సన్నరకం ధాన్యం వివరాలు..
మండలం మెట్రిక్ టన్నుల్లో
బోయిన్‌పల్లి 16.280
చందుర్తి 42.040
గంబీరావుపేట 710.960
ఇల్లంతకుంట 20.080
కోనరావుపేట 2,128.560
ముస్తాబాద్ 583.120
రుద్రంగి 25.280
సిరిసిల్ల 104.920
తంగళ్లపల్లి 392.800
వీర్నపల్లి 1,502.640
వేములవాడ 146.120
వేములవాడరూరల్ 284.080
ఎల్లారెడ్డిపేట 3,297.520
---------------------------------------------
మొత్తం 9,254.400
-----------------------------------------------
జిల్లాలో ఖరీఫ్ సాగు ఇలా..
మండలం వరి పత్తి ఇతర మొత్తం
గంభీరావుపేట 18,600 200 530 19,330
ఇల్లంతకుంట 24,000 12,500 1,970 38,470
ముస్తాబాద్ 23,000 600 1,650 25,250
సిరిసిల్ల 4,900 850 103 5,853
తంగళ్లపల్లి 19,950 1,000 1,081 22,031
వీర్నపల్లి 8,360 400 32 8,792
ఎల్లారెడ్డిపేట 17,500 3,600 30 21,130
బోయినపల్లి 13,000 7,000 1,310 21,310
చందుర్తి 15,200 6,200 210 21,610
కోనరావుపేట 18,200 4,800 700 23,700
రుద్రంగి 5,900 3,400 805 10,105
వేములవాడ 5,200 5,010 368 10,578
వేములవాడ రూరల్ 11,050 4,200 364 15,614
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,84,860 49,760 9,153 2,43,773
-----------------------------------------------------------------------------------------------------