గోదావరి దాటిన పెద్దపులి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:29 AM
గోదావరినది దాటి రామగుండం వైపు వచ్చిన పెద్దపులి ఎట్టకేలకు వారం రోజుల తరువాత తిరిగి గోదావరిదాటింది. సోమవారం రాత్రి గోదావరినది దాటి మంచిర్యాల జిల్లా రామారావుపేట ఓపెన్‌కాస్టు వైపు వెళ్టినట్టు ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరినదిలో పులి పాదముద్రలను గుర్తించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): గోదావరినది దాటి రామగుండం వైపు వచ్చిన పెద్దపులి ఎట్టకేలకు వారం రోజుల తరువాత తిరిగి గోదావరిదాటింది. సోమవారం రాత్రి గోదావరినది దాటి మంచిర్యాల జిల్లా రామారావుపేట ఓపెన్‌కాస్టు వైపు వెళ్టినట్టు ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరినదిలో పులి పాదముద్రలను గుర్తించారు. మరో వైపు సోమవారం రాత్రి ఇందారం, షెట్‌పెల్లి ప్రాంతాల్లో పులి సంచారాన్ని అక్కడి ఫారెస్టు అధికారులు గుర్తించారు. వచ్చిన వైపు నుంచే పులి వెనుదిరిగినట్టు తెలుస్తున్నది. తడోబ టైగర్ ఫారెస్టు నుంచి పులి వచ్చినట్టు భావిస్తున్నారు. గతంలో తడోబా నుంచి వచ్చిన పెద్ద పులిని శివ్వారం సమీపంలో వేటగాళ్లు చంపి చర్మం, గోర్లు తీయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ పులి సంచారంతో రెండు జిల్లాల ఫారెస్టు అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 14న మంచిర్యాల జిల్లా వైపు నుంచి గోదావరి దాటి మేడిపల్లి ఓసీపీ వైపు వచ్చిన పెద్దపులి మేడిపల్లి ఓసీపీ క్వారీ, అక్కడి నుంచి మల్యాపల్లి వైపు వెళ్లింది. మేకలు కాస్తున్న మహిళ పులి గుర్తించడంతో ఫారెస్టు అధికారులు అప్రమత్తమయ్యారు. మేడిపల్లి ఓసీపీ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లింగాపూర్ పరిసరాలకు వచ్చిన పెద్దపులి అక్కడి నుంచి తిరిగి రామారావుపేట వైపు వెళ్లినట్టు తెలుస్తుంది. మంగళవారం కాలిముద్రల ఆధారంగా గుర్తించినట్టు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఫారెస్టు డీఆర్‌ఓలు కొమురయ్య, దేవదాస్, ఎఫ్‌ఎస్‌ఓలు రహ్మతుల్లా, ఎనిమల్ ట్రాకర్లు పాల్గొన్నారు.