Share News

రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్‌ సేవలు

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:09 AM

మండలంలోని అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏఐ టెక్నాలజీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్‌ సేవలు

ముత్తారం, సెప్టెంబరు11(ఆంధ్రజ్యోతి): మండలంలోని అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏఐ టెక్నాలజీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్‌లో ప్రపంచానికి పోటీగా నిలబడాలని ఆయన కోరారు. మారుమూల అడవి శ్రీరాంపూర్‌ గ్రామాన్ని ఏఐ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటికి టీ ఫైబర్‌ సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరిని ఇంటర్నెట్‌ వినియోగదారులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రపంచం మొత్తం కృత్రిమ మేథస్సు వైపు దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ పాఠశాలల్లోను విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీని పరిజ్ఞానం అందించడం చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. అలాగే గ్రామం మొత్తం ప్రజల వినియోగం కోసం ఉచిత ఇంటర్నెట్‌ సేవలను ఆయన ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, యువతతోపాటు గ్రామ ప్రజలకు కూడా డిజిటల్‌ సేవలను అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూపర్‌ టీచర్‌, ఈడు రిఫార్మర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా 100 ఏఐ టూల్స్‌ కిట్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలో రూ.1.28 కోట్ల పెట్టుబడితో సుమారు వెయ్యికి పైగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ టీ ఫైబర్‌ కల్పించారని, ఏఐ ఆధారిత సీసీటీవీ సర్వే లైన్స్‌ సిస్టం ప్రారంభించిన ట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో టీ ఫైబర్‌ సేవలను ప్రారంభించామని, ఎనిమిది నెలలపాటు సంబంధిత కంపెనీ నాలుగు జిల్లాల్లో ఒక్కొక్క గ్రామాన్ని పూర్తి స్థాయిలో టీఫైబర్‌ కనెక్టివిటి చేశారని తెలిపారు. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఏఐ టెక్నాలజీ బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, టీ ఫైబర్‌ ఎండీ వేణు ప్రసాద్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వైనాల రాజు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, వైస్‌ చైర్మన్‌ మద్దెల రాజయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:09 AM