Share News

పదవీకాలం పొడిగింపా.. ప్రత్యేక పాలన...

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:32 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలక వర్గాలకు పొడిగించిన పదవీ కాలం ఈ నెల 14వ నాటికి ముగియనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టక పోగా, పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తారా, ప్రత్యేక అధికారుల పాలన తీసుక వస్తారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పదవీకాలం పొడిగింపా.. ప్రత్యేక పాలన...

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలక వర్గాలకు పొడిగించిన పదవీ కాలం ఈ నెల 14వ నాటికి ముగియనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టక పోగా, పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తారా, ప్రత్యేక అధికారుల పాలన తీసుక వస్తారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది న్నర క్రితం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం, ఏడాది క్రితం మండల, జిల్లా పరిషత్‌ పాలక వర్గాల పదవీ కాలం ముగియగా, ఆరు మాసాల క్రితం మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. వీటన్నింటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఫిబ్రవరి 14 తేదీతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీ కాలం ముగిసింది. అయితే ప్రభుత్వం సహకార సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన తీసుక రాకుండా, పాలక వర్గాల పదవీ కాలాన్ని ఆరు మాసాలు పొడిగించింది. ఆ గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనున్నది.

జిల్లాలో 20 సహకార సంఘాలు..

జిల్లాలో ప్రస్తుతం 20 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. సుల్తానాబాద్‌ మండలంలో సుల్తానాబాద్‌, గర్రెపల్లి, కనుకుల, చిన్నకల్వల, సుద్దాల, ఎలిగేడు మండలం ఎలిగేడు, ధుళికట్ట, జూలపల్లి మండలం జూలపల్లి, ఓదెల మండలం పొత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కాల్వశ్రీరాంపూర్‌, కూనారం, పెద్దపల్లి మండలం పెద్దపల్లి, అప్పన్నపేట. ధర్మారం మండలం ధర్మారం, పత్తిపాక, కమాన్‌పూర్‌ మండలం కమాన్‌పూర్‌, ముత్తారం మండలం ముత్తారం, మంథని మండలం మంథని, పాలకుర్తి మండలం కన్నాల, రామగుండం మండలం మేడిపల్లిలో సహకార సంఘాలు ఉన్నాయి.

ఈ సంఘాల్లో 52,316 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలతోపాటు దీర్ఘకాలిక, బంగారం తాకట్టు, వాహన, ఇతర రుణాలు అందజేస్తున్నారు. అలాగే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల విక్రయాలు చేపడుతున్నారు. రైతులు పండించిన పంట ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 250కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి సీజన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వల్ల కమీషన్‌ రూపేణా యేటా 12 కోట్ల రూపాయలు సహకార సంఘాలకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ ద్వారా ఆదాయం సమకూరుతున్నది. ఈ డబ్బులు సంఘం అభివృద్ధికి దోహద పడుతున్నాయి.

ఎన్నికల ప్రక్రియ చేపట్టని ప్రభుత్వం..

సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం దగ్గర పడుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టిన దాఖలాలు కనబడడం లేదు. ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల చైర్మన్లలో అత్యధిక మంది బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వాళ్లే కావడం గమ నార్హం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలకు ముందు నలుగురైదుగురు చైర్మన్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సహకార సంఘాల గడువు ముగిసిన ప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించాలనే ఒత్తిడి ప్రభు త్వంపై కాంగ్రెస్‌ నాయకులు పెంచుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉండ డంతో అవి ఆలస్యం అవుతున్నాయి. ఎలాంటి చిక్కులు లేని సహకార సంఘాల ఎన్నికలను ఎందుకు నిర్వహిం చడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. గడువు లోపు ఎన్నికలు నిర్వహించకుంటే ఉన్న పాలక వర్గాల పదవీ కాలం పెంచకుండా, ప్రత్యేక అధికారుల పాలన తీసుక వచ్చి ఎన్నికల ప్రక్రియను ఆరంభించి నెల రోజుల్లో ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Updated Date - Aug 02 , 2025 | 12:32 AM