Share News

ముగిసిన మద్యం షాపుల టెండర్లు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:47 PM

జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల దాఖలు గడువు గురువారం నాటితో ముగిసింది. మొత్తం 74 మద్యం షాపులకుగాను 1471 దరఖాస్తులు వచ్చాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి 44 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు బంధంపల్లిలోని స్వరూప గార్డెన్‌లో డ్రా పద్ధతిన లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నారు.

ముగిసిన మద్యం షాపుల టెండర్లు

పెద్దపల్లి, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల దాఖలు గడువు గురువారం నాటితో ముగిసింది. మొత్తం 74 మద్యం షాపులకుగాను 1471 దరఖాస్తులు వచ్చాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి 44 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు బంధంపల్లిలోని స్వరూప గార్డెన్‌లో డ్రా పద్ధతిన లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 2027 నవంబర్‌ 30 వరకు రెండేళ్ల పాటు జిల్లాలో గల 74 మద్యం షాపుల నిర్వహణకు గాను ప్రభుత్వం టెండర్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారాన్ని 3 లక్షలకు పెంచింది. గతంలో 77 షాపులు ఉండగా, 2022 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా 40 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల ధర పెంచడంతో వ్యాపారులు ఆచీతూచి అడుగులు వేశారు. గతంలో కంటే దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ, ఆదాయం మాత్రం అదనంగా 3 కోట్ల 69 లక్షల రూపాయలు వచ్చింది. వాస్తవానికి దరఖాస్తుల గడువు తేదీ ఈ నెల 18వ తేదీ నాటికే ముగియగా 1378 వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కంటే దరఖాస్తు లు తక్కువగా వచ్చాయని ప్రభుత్వం 23వ తేదీ వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో మరో 99 దరఖాస్తులు వచ్చాయి. పెద్దపల్లి సర్కిల్‌ పరిఽధిలోని 20 షాపులకు 421 దర ఖాస్తులు, సుల్తానాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని 15 షాపులకు 299, రామగుండం సర్కిల్‌ పరిధిలోని 24 షాపులకు 470, మంథని సర్కిల్‌ పరిధిలోని 15 షాపులకు 281 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Oct 23 , 2025 | 11:47 PM