Share News

ముగిసిన మద్యం షాపుల టెండర్లు

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:03 AM

మద్యం షాపుల టెండర్లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. 2023లో వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇందుకు రెండు లక్షల రూపాయలు ఉన్న దరఖాస్తు ఫారాన్ని మూడు లక్షలకు పెంచడం వల్లనే వ్యాపారులు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.

ముగిసిన మద్యం షాపుల టెండర్లు

పెద్దపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల టెండర్లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. 2023లో వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇందుకు రెండు లక్షల రూపాయలు ఉన్న దరఖాస్తు ఫారాన్ని మూడు లక్షలకు పెంచడం వల్లనే వ్యాపారులు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. 2025-27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో గల 74 మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెప్టెంబరు 26న గెజిట్‌ విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు ఒకటి నుంచి 2027 నవంబరు 30వ తేదీ వరకు లైసెన్సులు జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకొనేందుకు 23 రోజుల గడువు ఇచ్చినప్పటికి ఇందుకు వ్యాపారులు పెద్దగా ముందుకు రాలేదు. చివరి రెండు రోజుల్లోనే దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఈ నెల 17న ఒక్క రోజే 374 దర ఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శనివారం రాత్రి 8 గంటల వరకు 1,189 దరఖాస్తులు వచ్చాయి. 2023లో 77 మద్యం షాపులకు గాను 2022 దరఖాస్తులు వచ్చాయి. వాటి రూపేనా ప్రభుత్వంకు 40 కోట్ల 44 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సారి కూడా మద్యం వ్యాపారుల నుంచి భారీ స్పందన లభిస్తుందని భావించిన ప్రభుత్వం దరఖాస్తుల ధరను రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచడం వలన వ్యాపారులు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

Updated Date - Oct 19 , 2025 | 12:03 AM