టాస్క్ సెంటర్ కోర్సులపై ప్రచారం చేయాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:28 AM
యువతకు టాస్క్ సెంటర్ ద్వారా అందించే కోర్సులపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో టాస్క్ సెంటర్‌లో కల్పిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలపై అధికారులు, కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): యువతకు టాస్క్ సెంటర్ ద్వారా అందించే కోర్సులపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో టాస్క్ సెంటర్‌లో కల్పిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలపై అధికారులు, కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో టాస్క్ సెంటర్ ద్వారా వెయ్యి మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇందులో పరిశ్రమల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలు, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో సమన్వయంతో పలు కార్యక్రమాలను అమలు చేస్తూ ఉపాధి కల్పించాలన్నారు. వారికి అవసరమైన నైపుణ్యాల శిక్షణ కోసం నిధులు, లాజిస్టిక్స్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు సహకారం అందుతుందన్నారు. టాస్క్ సెంటర్‌లో వివిధ కోర్సులు నేర్చుకున్న యువతకు 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి, అధికారులు పాల్గొన్నారు.