టాస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:04 AM
యువతీ, యువకులు టాస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో టాస్క్ ప్రతినిధులు, కోఆర్డినేటర్‌తో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): యువతీ, యువకులు టాస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో టాస్క్ ప్రతినిధులు, కోఆర్డినేటర్‌తో సమావేశం నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్, వివిధ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారిలో ప్రస్తుతం 30 శాతం అభ్యర్థులకే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, వీటిని కనీసం 60 నుంచి 65 శాతానికి పెంచడమే లక్ష్యంగా టాస్క్, టీ హబ్, టీ వర్క్స్ వంటి సంస్థలు పని చేస్తున్నాయని వివరించారు. టాస్క్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయ ఆధ్వర్యంలో 2023-2024, 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు టెలిఫెర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో కల్పిస్తారని తెలిపారు.
యువతీ, యువ తకు సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్య శిక్షణ 15 రోజుల పాటు అందిస్తారని, శిక్షణ తర్వాత అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పెద్దపల్లి ప్రాంతీయ టాస్క్ సెంటర్‌లో ఈ నెల 10 లోగా రిజిస్ర్టేషన్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులకు రూ.3 నుంచి 7 లక్షల ప్యాకేజీలతో మల్టీనేషనల్ కంపెనీలలో ఉపాధి లభించిందని కలెక్టర్ తెలిపారు. అలాగే పలు డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో నైపుణ్య శిక్షణ గురించి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. టాస్క్ ప్రతినిదులు ప్రదీప్‌రెడ్డి, ప్రొగ్రాం మేనేజర్ సుదీర్, టెలిఫెర్ఫార్మెన్స్ కంపెనీ ప్రతినిధులు గీతు చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ అతుల్ శర్మ, జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు, మేనేజర్ గంగ ప్రసాద్, టాస్క్ కోఆర్డినేటర్ కౌసల్య తదితర అధికారులు పాల్గొన్నారు.