Share News

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి మద్దతు ధర

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:58 PM

పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్‌ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి మద్దతు ధర

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్‌ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రైతు కలవెన మల్లేశంకు చెందిన 27 క్వింటాళ్ల 80 కిలోల పత్తిని కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన ఏ గ్రేడ్‌ పత్తికి క్వింటాలుకు రూ. 8100 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. 8 నుండి 12 శాతం లోపు తేమ ఉండేలా పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులను కోరారు.

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటల దిగుబడి తగ్గిందన్నారు. రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. వరి పొలాలు కోసిన తరవాత కోయకాలుకు రైతులు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గుతుందని, పంటకు ఉపయోగపడే సారవంతమైన కీటకాలు నశించి పంటల దిగుబడి తగ్గుతుందని రైతులు పంట అవశేషాలను భూమిలో కలియదున్నాలని తెలిపారు. పత్తి చివరి దశలో ఉన్నదని, దాని స్థానంలో యాసంగి సాగుగా మొక్కజొన్న సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. హైబ్రిడ్‌ సీడ్‌ మొక్క జొన్న సాగుతో ఎక్కువ దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని, ఆ దిశగా రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంటల సాగుకు కలిగే ప్రయోజనాలను వివరించారు. జిన్నింగ్‌ మిల్‌ యజమానులు నర్సింగరావు, మంగారావు, సిసిఐ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 11:58 PM